తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. భూముల ధరలకు రెక్కలు?
After the Telangana Global Summit, land prices around Future City are rising sharply, driven by artificial hikes. Investors remain cautious amid election uncertainty and lack of a clear master plan.
* గ్లోబల్ సమ్మిట్ తో భారత్ ప్యూచర్ సిటీకి క్రేజ్
* ఫ్యూచర్ సిటీలో కృత్రిమంగా పెంచుతున్న ధరలు
* ఆచితూచి అడుగులేస్తున్న ఇన్వెస్టర్లు, ప్రవాసులు
* మూడేళ్లయ్యాక ఎన్నికల గురించే ఆలోచన
* సంస్థలొచ్చాకే చూద్దామంటున్న బయ్యర్లు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ పుణ్యమా అంటూ.. ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాల భూముల ధరలకు రెక్కలొస్తాయని స్థానిక రియల్టర్లు, బిల్డర్లు, ఏజెంట్లు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు స్థానిక రైతులు, ఏజెంట్లు ఇప్పటికే పది నుంచి ఇరవై శాతం భూముల ధరల్ని కృత్రిమంగా పెంచేసినట్లు సమాచారం. కాకపోతే, గత రెండేళ్ల నుంచి ప్లాట్లను కొనే నాథుడు నగరంలో పెద్దగా కనిపించట్లేదు. ఫలితంగా, అనేక రియల్ సంస్థలు దారుణమైన నష్టాల్న ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్ నలువైపులా ఇదే దుస్థితి నెలకొంది. కనీసం ఇప్పటికైనా, పరిస్థితిలో మార్పు వస్తుందా అని శ్రీశైలం రోడ్డు, సాగర్ రోడ్డులో ఇప్పటికే ప్లాట్లు కొన్నవారు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.
ఫ్యూచర్ సిటీకి సంబంధించి కొందరు నిపుణులు సరికొత్త విశ్లేషణకు తెరలేపారు. ఫ్యూచర్ సిటీలో లోపలే రెసిడెన్షియల్ కమ్యూనిటీలను ఏర్పాటు చేయడం వల్ల.. అందులో ఉద్యోగం చేసేవారు అక్కడే ఉంటారు తప్ప బయటికొచ్చి ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేయరని అభిప్రాయపడుతున్నారు. ఇదే నిజమైతే, ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల భూములు, ప్లాట్లు కొనుగోలు చేసినా పెద్దగా ఉపయోగం ఉండదని వాదించేవారు లేకపోలేరు. అందుకే, గత రెండేళ్లుగా ఇటువైపు ఎవరూ పెద్దగా ప్లాట్లను కొనుగోలు చేయడం లేదని స్థానిక రియల్టర్లు అంటున్నారు.
ఎన్నికల ప్రభావం
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీ బదులు ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తోంది. మూడేళ్లలో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గనక ఓడిపోతే.. కొత్త ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీని కొనసాగిస్తుందా? లేక మరో కొత్త సిటీని ఏర్పాటు చేస్తుందా? అనే సందేహం సామాన్యుల్లోనూ నెలకొంది. మరి, ఇలాంటి గందరగోళ పరిస్థితి వల్ల.. బయ్యర్లు, ఇన్వెస్టర్లు, ప్రవాసులు వంటివారు ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలిసింది.
మాస్టర్ ప్లాన్ ఎక్కడ?
2047 లోపు తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేర్చాలని రేవంత్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ప్యూర్, క్యూర్, రేర్ అంటూ మూడు జోన్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు, బిల్డర్లు, డెవలపర్లు, రియల్టర్లకు పూర్తి అవగాహన రావడానికి హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాల్సిన అవసరముంది. అసలు ఏయే జోన్లు ఎక్కడెక్కడ వస్తాయో తెలియకుండా.. ఇందుకోసం అవసరమయ్యే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయకపోవడం వల్ల.. అసలుకే మోసం వస్తుంది. కాబట్టి, తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయాలి.
ఎకరానికి ఎంత? (బాక్స్)
ముచ్చర్ల చుట్టు పక్కల ప్రాంతాల్లో గ్లోబల్ సమ్మిట్ తో 20 నుంచి 30 శాతం మేర భూముల ధరలు పెరిగాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. కందుకూరు మండలంలోని ముచ్చర్లలో ఎకరం కోటీ ఎనభై లక్షలుండగా.. ఇప్పుడు ఆరంభ ధర రెండున్నర కోట్లు చెబుతున్నారు. గరిష్ఠంగా ఇక్కడ నాలుగు కోట్లు. కడ్తాల్ మండలంలో నిన్నటి వరకు ఎకరా భూమి ధర కోటీ ముప్పయ్ లక్షలుండగా.. ఫ్యూచర్ పనులు ప్రారంభమయ్యాక కోటీ 80 లక్షల నుంచి 3 కోట్ల వరకు పెంచేశారు. ఇలా కృత్రిమంగా ధరలను పెంచడం వల్ల అసలైన బయ్యర్లు ఆసక్తి చూపెట్టడం లేదు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0