ఏఎస్ బీఎల్.. ఎంత మోసం చేసింది?
ఏఎస్ బీఎల్.. ఎంత మోసం చేసింది?
* పోచారంలోని ఏఎస్ బీఎల్ స్ప్రింగ్స్ కొనుగోలుదారుల ఆవేదన
* అంత పెద్దపెద్ద మాటలు చెప్పి.. నాణ్యత ఇంత అధ్వాన్నమా?
* మెయింటనెన్స్ ఛార్జీలను ముందే కట్టేసినా మళ్లీ కట్టమంటారా?
* లీకేజీల నుంచి సీపేజీల వరకు 70 సమస్యలను పరిష్కరించరా?
ఇల్లంటే ఓ ఎమోషన్. తరతరాలు నిలిచే ఓ బంధం. ఎవరైనా తమ జీవితంలో పెట్టే అతిపెద్ద పెట్టుబడి ఇదే. సొంతిల్లు ఉంటే కలిగే ఆ సంతృప్తే వేరు. అందుకే ఎన్నాళ్లుగానో దాచిన మొత్తాన్ని డౌన్ పేమెంట్ గా కట్టి.. దాదాపు రిటైరయ్యే వరకు ఈఎంఐలు చెల్లించైనా సరే.. ఓ ఇంటివారు కావాలనే తపన చాలామందిలో కనిపిస్తుంది. ఇలాంటి ఓ ఎమోషనల్ బంధానికి విలువ ఇచ్చి, న్యాయంగా స్థిరాస్తి వ్యాపారం చేయాల్సిన సంస్థలు.. కొనుగోలుదారుల భావోద్వేగాలతో ఆటలాడుకుంటున్నాయి. తీసుకుంటున్న డబ్బుకు సరైన ఇంటిని ఇవ్వకుండా పలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. చిన్నాచితకా.. ఊరూపేరూ లేని సంస్థల్లో పెట్టుబడులు పెట్టి మోసపోవడం కంటే ఖరీదెక్కవైనా పర్లేదు.. కాస్త పెద్ద కంపెనీ ఫ్లాట్ నే కొనడం బెటరని ఆలోచించే వాళ్లే ఎక్కువగా ఉంటారు. కానీ ఇక్కడ సంస్థ చిన్నదైనా.. పెద్దదైనా.. కొందరి వక్రబుద్ధితో కొనుగోలుదారులు మోసపోతూనే ఉన్నారు. ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తాజాగా ఏఎస్ బీఎల్ సంస్థ ఈ కోవలోకే చేరింది. పోచారంలో ఈ సంస్థ నిర్మించిన ఏఎస్ బీఎల్ స్ప్రింగ్స్ ప్రాజెక్టు పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. పెద్ద సంస్థ కదా.. ఇందులో ఫ్లాట్ తీసుకుంటే హాయిగా ఉండొచ్చు అనుకున్నవారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు.
అద్భుత నిర్మాణం అని ఆకట్టుకుని..
హైదరాబాద్ లో అద్భుతమైన ప్రాజెక్టులు నిర్మిస్తాం.. మా ప్రాజెక్టుల్లో ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పిస్తాం.. కస్టమర్ సెంట్రిక్ గానే మా ప్రాజెక్టుల డిజైన్ ఉంటుంది అంటూ ఊదరగొట్టలిన ఏఎస్ బీఎల్ మాటలన్నీ ఒట్టి బూటకమని తేలిపోయింది. పేరు గొప్ప ఊరు దిబ్బ అనే రీతిలో ఈ సంస్థ వ్యవహారం ఉందని అర్థమైపోయింది. అద్భుతమైన నిర్మాణాలు.. ప్రపంచస్థాయి సౌకర్యాలు అని చెప్పి కొనుగోలుదారులను బుట్టలో వేసుకున్న సంస్థ.. నాసిరకం ఫ్లాట్లను అప్పగించిందని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరున్న సంస్థ కదా అని నమ్మి.. లక్షలు పోసి ఫ్లాట్లు కొని ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పోచారంలోని ఏఎస్ బీఎల్ స్ప్రింగ్స్ కొనుగోలుదారులు వాపోతున్నారు. కన్ స్ట్రక్షన్ అస్సలు బాలేదని, బాత్ రూమ్ లోని గోడల నుంచి నీరు కారుతోందని.. బయట గోడలకు చెమ్మ వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని గత ఎనిమిది నెలలుగా పలుమార్లు విన్నవించినా.. అసలు పట్టించుకున్న పాపానే పోలేదని విమర్శిస్తున్నారు. సమస్యలు పరిష్కరించకపోగా.. మెయింటనెన్స్ ఛార్జీల పేరుతో అదనపు భారం వేయడాన్ని నిరసిస్తూ.. ఫ్లాట్ యజమానులు తాజాగా గణతంత్ర దినోత్సవం నాడు ఆందోళనను నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తమ ఆవేదన వెలిబుచ్చారు.
ఒకటి కాదు రెండు కాదు
డెబ్బయ్ సమస్యలు..
పోచారంలో 2019లో ప్రారంభమైన ఏఎస్‌బీఎల్ స్ప్రింగ్స్ ప్రాజెక్టులో తాము ఫ్లాట్లు తీసుకున్నామని.. 2025 ఏప్రిల్ నుంచి హ్యాండోవర్ చేయడం ప్రారంభించారని తెలిపారు. ఫ్లాట్ ధర, మూవింగ్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజులతోపాటు రెండేళ్ల మెయింటనెన్స్ సొమ్మును కూడా చెల్లించినట్టు తెలిపారు. అనంతరం ఫ్లాట్లలోకి వచ్చిన తర్వాత చాలా సమస్యలు గుర్తించినట్టు చెప్పారు. కనీసం గోడలోకి చిన్న మేకు కూడా కొట్టినా అందులో ఉండకుండా కిందకు పడిపోతోందని.. అంత ఘోరంగా నిర్మాణ నాణ్యత ఉందన్నారు. పైనుంచి స్విమింగ్ పూల్ లోకి శ్లాబు పడిపోయిందని, ఆ సమయంలో పిల్లలుంటే పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో ఫాల్స్ సీలింగ్ పడిపోతే తామేం కావాలని ప్రశ్నించారు. లీకేజీలు, సీపేజీలతోపాటు స్టక్చరల్ సమస్యలన్నీ కలిసి మొత్తం 70 సమస్యలు గుర్తించి.. ఏఎస్‌బీఎల్ మేనేజ్ మెంట్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
* ప్రాజెక్టు అప్పగించినప్పటి నుంచి ఇంతవరకూ మంచినీళ్లు కూడా లేవన్నారు. అసలు సరైన మెయింటనెన్స్ కూడా లేదని.. ఏఎస్ బీఎల్ నుంచి ప్రతినిధులు లేకుండా థర్డ్ పార్టీని పెట్టి మెయింటెనెన్స్ చేస్తున్నారని వివరించారు. సమస్యల పరిష్కారం కోసం పలు మార్లు చెప్పినా.. అపాయింట్ మెంట్ అడిగినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలదన్నట్టు.. తాజాగా కామన్ ఏరియా మెయింటనెన్స్ ఛార్జీలని చెప్పి నెలకు రూ.750 చొప్పున గత ఆరు నెలలకు రూ.5వేలు కట్టాలని నోటీసిచ్చారని.. అవి కట్టకుంటే.. కరెంట్, నీరు కట్ చేస్తామని హెచ్చిరించినట్టు వెల్లడించారు. తాము ముందుగానే మెయింటనెన్స్ ఛార్జీలను చెల్లించినా.. మళ్లీ కట్టాలనడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ‘మా ఫ్లాట్లలో అన్నీ ప్రీపెయిడ్. కరెంట్, గ్యాస్, వాటర్ కు సంబంధించి హోమ్స్ యాప్ ఉంటుంది. ఆ యాప్ లో మేం ముందుగానే రీచార్జ్ చేసుకుంటే.. రోజు వారీ మేం ఎంత వినియోగించామో అంత మేర అమౌంట్ కట్ అవుతుంది. తాజాగా అందులో నుంచి మాకు చెప్పకుండా ఒక్కో ఫ్లాట్ కు రూ.5200 కట్ చేశారు. ఇదేమిటని అడిగితే.. మీకు సమాధానం చెప్పాల్సిన పని మాకు లేదని మాట్లాడుతన్నారు’ అని ఆవేదన చెందారు. ఇప్పటికైనా సంస్థ యాజమాన్యం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. వారు వచ్చి వీటిని పరిష్కరించేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0