టీడీఆర్ ఎఫెక్ట్: మధ్యతరగతి సొంతింటి కల మరింత దూరం చేస్తున్న రేవంత్ సర్కార్?
“TDR Policy Impact: Is the Revanth Government Making Homeownership Harder for the Middle Class?”
* పది శాతం టీడీఆర్ జీవో డైరెక్ట్ ఎఫెక్ట్
* ప్రభుత్వ కోణంలో మంచి నిర్ణయమే.. కానీ!
* మధ్యతరగతి సొంతింటి ఆశలపై తూట్లు
* కొత్త ప్రాజెక్టుల్లో ఇళ్ల ధరలు పెరుగుదల
* చదరపు అడుక్కీ రూ.150 నుంచి 570కి పెరుగుదల
* ఐదు ఎకరాల ప్రాజెక్టపై రూ.129 కోట్లు టీడీఆర్ కట్టాలి
(కింగ్ జాన్సన్ కొయ్యడ, 9030034591)
మీరు హైదరాబాద్‌లో సొంతిల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నారా? రెండేళ్ల నుంచి మార్కెట్ మెరుగ్గా లేకపోవడంతో.. కాస్త తక్కువ ధరకే ఫ్లాట్లు లభిస్తాయని మీరు భావిస్తున్నారా? అయితే, మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే, ఇక నుంచి కొత్తగా ఆరంభమయ్యే ప్రాజెక్టుల్లో ఫ్లాట్ల ధరలు కనీసం పది నుంచి పాతిక శాతం పెరగడానికి అవకాశముంది. అదెలా అంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయమే ఇందుకు ప్రధాన కారణం. మూసీ పునరుజ్జీవం, రహదారుల విస్తరణ కోసం అవసరమయ్యే నిధుల్ని.. ఇక నుంచి కొత్త ఇళ్ల కొనుగోలుదారుల నుంచి వసూలు చేయడానికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ వేసింది. దీని వల్ల హైదరాబాద్‌లో కొత్తగా ప్రాజెక్టుల్ని ఆరంభించేందుకు అధిక శాతం బిల్డర్లు ముందుకొచ్చే అవకాశం పెద్దగా కనిపించట్లేదు.
హైదరాబాద్‌లో కొత్తగా ఎవరైనా పది అంతస్తులను మించి ఎవరూ అపార్టుమెంట్లను నిర్మించినా.. పది శాతం టీడీఆర్‌ను కొనుగోలు చేసి.. అనుమతికి దరఖాస్తు చేయాలని ప్రభుత్వం ఇటీవల జీవోను విడుదల చేసింది. అంటే ఎవరైనా నలభై అంతస్తులు లేదా నలభై ఐదు అంతస్తుల నిర్మాణాన్ని చేపడితే.. పది అంతస్తుల్ని వదిలేసి.. మిగతా ముప్పయ్ అంతస్తుల్లో వచ్చే మొత్తం బిల్టప్ ఏరియా మీద.. బిల్డర్లు పది శాతం టీడీఆర్‌ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే, హైదరాబాద్‌లో అపార్టుమెంట్‌కు అనుమతికి దరఖాస్తు చేయాలంటే.. ఈ టీడీఆర్‌ను కొనుగోలు చేసి.. సమర్పించాలన్నమాట. అప్పుడే, బిల్డింగ్ అనుమతి లభిస్తుంది. మరి, టీడీఆర్ కొనడానికి బిల్డర్లకు ఎంత ఖర్చువుతుందంటే..?
నలభై అంతస్తులపై ఎంత భారం?
హైదరాబాద్‌లో ఎవరైనా నలభై అంతస్తుల బిల్డింగ్ కట్టాలని ప్లాన్ చేశారనుకుందాం. అప్పుడు టీడీఆర్ ఎంత కట్టాల్సి వస్తుందంటే.. కూకట్‌పల్లి లేదా నానక్‌రాంగూడలో ఒక బిల్డర్ నలభై అంతస్తుల బిల్డింగ్‌ను కట్టాలని అనుకుంటే.. ఎకరానికి ఎంత లేదన్నా నాలుగు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని నిర్మిస్తారు. మరి, ఆయా ప్రాంతంలో మార్కెట్ గైడింగ్ విలువ గజానికి రూ.44,900 ఉంది. ఎస్ఎఫ్‌టీ చొప్పున లెక్కిస్తే.. ఇది రూ.4,989 అవుతుంది. ఎకరానికి నాలుగు లక్షల చదరపు అడుగుల నుంచి పది శాతాన్ని మినహాయిస్తే.. 30 లక్షల చదరపు అడుగులు మిగులుతుంది. ఇందులో నుంచి పది శాతాన్ని లెక్కిస్తే.. 30,000 చదరపు అడుగులు అవుతుంది. మార్కెట్ గైడింగ్ విలువను ఈ పది శాతంతో లెక్కిస్తే.. రూ.14,96,66,667 అవుతుంది. దీనిపై జీఎస్టీ రూ.2,69,40,000 అవుతుంది. అంటే, బిల్డర్ ఎకరం స్థలంపై సుమారు రూ.17,66,06,667 సొమ్మును టీడీఆర్ రూపంలో కొనుగోలు చేయాలి. అనుమతి తీసుకునే సమయంలో ఈ మొత్తాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఈ సొమ్మును చదరపు అడుగుల్లో లెక్కిస్తే.. చదరపు అడుక్కీ రూ.442 అవుతుందన్నమాట. ఈ మొత్తం భారంపై బిల్డర్ భరించడు కాబట్టి.. కొనుగోలుదారుల నుంచే వసూలు చేస్తారని గుర్తుంచుకోవాలి.
కోర్ సిటీలో ఎంత పెరుగుతుంది?
ఆజామాబాద్ ఇండస్ట్రీయల్ ఏరియా పరిధిలో ఎవరైనా 40 అంతస్తుల ఆకాశహర్మ్యాన్ని నిర్మించాల్సి వస్తే.. అదనంగా ఎంత భారం పడుతుందో ఇప్పుడు చూద్దాం. ఆయా ప్రాంతంలో మార్కెట్ విలువ రూ.54,500 ఉంది. చదరపు అడుక్కీ రూ.6,056 అన్నమాట. ఇక్కడ ఎకరానికి 4 లక్షల చదరపు అడుగులు కట్టాల్సి వచ్చినప్పుడు.. 10 అంతస్తులను మినహాయిస్తే.. మూడు లక్షల చదరపు అడుగులు వస్తుంది. అందులో పది శాతం బిల్టప్ ఏరియాను లెక్కిస్తే.. అంటే ముప్పయ్ వేల చదరపు అడుగులపై టీడీఆర్‌ను మార్కెట్ విలువ ప్రకారం లెక్కిస్తే.. రూ.18,16,66,667 అవుతుంది. దీనిపై జీఎస్టీని కలిపితే రూ.3,27,00,000 వస్తుంది. అంటే, ఒక బిల్డర్ కొత్తగా నలభై అంతస్తుల ఆకాశహర్మ్యాన్ని కట్టాలంటే.. ఎకరానికి రూ.21,43,66,667 కట్టాల్సి ఉంటుంది. ఐదు ఎకరాల్లో ఎవరైనా కొత్తగా ప్లాన్ చేస్తే మాత్రం.. 110 కోట్ల దాకా చెల్లించక తప్పదు. అంటే, చదరపు అడుగుపై కనీసం రూ.536 అదనంగా బిల్డర్‌కు ఖర్చు అవుతుంది. అంటే, ఆజామాబాద్ వంటి ప్రాంతంలో కొత్తగా ఎవరు అపార్టుమెంట్‌ను కట్టినా.. ప్రస్తుత ధరల కంటే అదనంగా చదరపు అడుక్కీ రూ.536 దాకా చెల్లించాల్సి ఉంటుంది.
యాభై అంతస్తులపై రూ.129 కోట్లు
ఆజామాబాద్ ఇండస్ట్రీయల్ ఏరియా పరిధిలో ఎవరైనా 50 అంతస్తుల ఆకాశహర్మ్యాన్ని నిర్మించాల్సి వస్తే.. అదనంగా ఎంత భారం పడుతుందో ఇప్పుడు చూద్దాం. ఆయా ప్రాంతంలో మార్కెట్ విలువ రూ.54,500 ఉంది. చదరపు అడుక్కీ రూ.6,056 అన్నమాట. ఇక్కడ ఎకరానికి 4.50 లక్షల చదరపు అడుగులు కట్టాల్సి వచ్చినప్పుడు.. 10 అంతస్తులను మినహాయిస్తే.. మూడు లక్షల అరవై వేల చదరపు అడుగులు వస్తుంది. అందులో పది శాతం బిల్టప్ ఏరియాను లెక్కిస్తే.. అంటే ముప్పయ్ ఆరు వేల చదరపు అడుగులపై టీడీఆర్‌ను మార్కెట్ విలువ ప్రకారం లెక్కిస్తే.. రూ.21,80,00,000 అవుతుంది. దీనిపై జీఎస్టీని కలిపితే రూ.3,92,40,000 వస్తుంది. అంటే, ఒక బిల్డర్ కొత్తగా నలభై అంతస్తుల ఆకాశహర్మ్యాన్ని కట్టాలంటే.. ఎకరానికి రూ.25,72,40,000 కట్టాల్సి ఉంటుంది. ఐదు ఎకరాల్లో ఎవరైనా కొత్తగా ప్లాన్ చేస్తే మాత్రం.. రూ. 129 కోట్ల దాకా చెల్లించక తప్పదు. అంటే, చదరపు అడుగుపై కనీసం రూ.536 అదనంగా బిల్డర్‌కు ఖర్చు అవుతుంది. అంటే, ఆజామాబాద్ వంటి ప్రాంతంలో కొత్తగా ఎవరు అపార్టుమెంట్‌ను కట్టినా.. ప్రస్తుత ధరల కంటే అదనంగా చదరపు అడుక్కీ రూ.572 దాకా చెల్లించాల్సి ఉంటుంది.
ఎకరంపై రూ.21.19 కోట్లు లోడింగ్
హైదరాబాద్‌లో ఎవరైనా యాభై అంతస్తుల బిల్డింగ్ కట్టాలని ప్లాన్ చేశారనుకుందాం. అప్పుడు టీడీఆర్ ఎంత కట్టాల్సి వస్తుందంటే.. కూకట్‌పల్లి లేదా నానక్‌రాంగూడలో ఒక బిల్డర్ నలభై అంతస్తుల బిల్డింగ్‌ను కట్టాలని అనుకుంటే.. ఎకరానికి ఎంత లేదన్నా నాలుగు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని నిర్మిస్తారు. మరి, ఆయా ప్రాంతంలో మార్కెట్ గైడింగ్ విలువ గజానికి రూ.44,900 ఉంది. ఎస్ఎఫ్‌టీ చొప్పున లెక్కిస్తే.. ఇది రూ.4,989 అవుతుంది. ఎకరానికి నాలుగున్నర లక్షల చదరపు అడుగుల నుంచి పది శాతాన్ని మినహాయిస్తే.. 3 లక్షల అరవై వేల చదరపు అడుగులు మిగులుతుంది. ఇందులో నుంచి పది శాతాన్ని లెక్కిస్తే.. 36,000 చదరపు అడుగులు అవుతుంది. మార్కెట్ గైడింగ్ విలువను ఈ పది శాతంతో లెక్కిస్తే.. రూ.17,96,00,000 అవుతుంది. దీనిపై జీఎస్టీ రూ.3,23,28,000 అవుతుంది. అంటే, బిల్డర్ ఎకరం స్థలంపై సుమారు రూ.21,19,28,000 సొమ్మును టీడీఆర్ రూపంలో కొనుగోలు చేయాలి. అనుమతి తీసుకునే సమయంలో ఈ మొత్తాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఈ సొమ్మును చదరపు అడుగుల్లో లెక్కిస్తే.. చదరపు అడుక్కీ రూ.471 అవుతుందన్నమాట. ఈ మొత్తం భారంపై బిల్డర్ భరించడు కాబట్టి.. కొనుగోలుదారుల నుంచే వసూలు చేస్తారని గుర్తుంచుకోవాలి.
కోకాపేట్ నియోపోలిస్‌లో ఎంత?
కోకాపేట్ నియోపోలిస్ అంటే హాట్ లొకేషన్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఇటీవల ప్రభుత్వం వేలం పాటల్ని నిర్వహించి.. ఎకరానికి రూ.130 కోట్లను మించిన రేట్లు ఇక్కడ పలికాయి. మరి, తాజాగా టీడీఆర్ వల్ల ఈ ప్రాంతంలో బిల్డర్లపై ఎంత భారం పడుతుంది? తద్వారా బయ్యర్‌పై ఎంత ప్రభావం పడుతుందో ఒకసారి చూద్దాం.
* కోకాపేట్‌లో ఎవరైనా యాభై అంతస్తుల బిల్డింగ్ కట్టాలని ప్లాన్ చేశారనుకుందాం. అప్పుడు టీడీఆర్ ఎంత కట్టాల్సి వస్తుందో చూద్దాం. ఇక్కడ ఎకరానికి ఎంత లేదన్నా నాలుగున్నర లక్షల చదరపు అడుగుల స్థలాన్ని నిర్మిస్తారు. మరి, ఆయా ప్రాంతంలో మార్కెట్ గైడింగ్ విలువ గజానికి రూ.14,400 ఉంది. ఎస్ఎఫ్‌టీ చొప్పున లెక్కిస్తే.. ఇది రూ.1,600 అవుతుంది. ఎకరానికి నాలుగున్నర లక్షల చదరపు అడుగుల నుంచి పది శాతాన్ని మినహాయిస్తే.. 3.60 లక్షల చదరపు అడుగులు మిగులుతుంది. ఇందులో నుంచి పది శాతాన్ని లెక్కిస్తే.. 36,000 చదరపు అడుగులు అవుతుంది. మార్కెట్ గైడింగ్ విలువను ఈ పది శాతంతో లెక్కిస్తే.. రూ.5,76,00,000 అవుతుంది. దీనిపై జీఎస్టీ రూ.1,03,68,000 అవుతుంది. అంటే, బిల్డర్ ఎకరం స్థలంపై సుమారు రూ.6,79,68,000 సొమ్మును టీడీఆర్ రూపంలో కొనుగోలు చేయాలి. అనుమతి తీసుకునే సమయంలో ఈ మొత్తాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఈ సొమ్మును చదరపు అడుగుల్లో లెక్కిస్తే.. చదరపు అడుక్కీ రూ.151 అవుతుందన్నమాట. ఈ మొత్తం భారంపై బిల్డర్ భరించడు కాబట్టి.. కొనుగోలుదారుల నుంచే వసూలు చేస్తారని గుర్తుంచుకోవాలి.
* కోకాపేట్‌లో ఎకరానికి మార్కెట్ విలువ తక్కువ ఉంది కాబట్టి.. ఇతర ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ టీడీఆర్ భారం తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ, ఇక్కడ యాభై అంతస్తుల అపార్టుమెంట్‌ను కట్టాలంటే, ఎంతలేదన్నా రూ.50-60 కోట్లు కట్టాల్సి ఉంటుంది. దీనిపై మళ్లీ తాజాగా టీడీఆర్ కట్టాలంటే.. ఒకింత కష్టమేనని చెప్పాలి. ఎకరానికి రూ.130 -140 కోట్లు పెట్టిన కొనుగోలు చేసిన స్థలంలో సహజంగానే అధిక ఎస్ఎఫ్‌టీ కడితే తప్ప వర్కవుట్ అవ్వదు. అలాంటిది పది ఫ్లోర్ల దాటిన తర్వాత టీడీఆర్ అంటే.. కాస్త అధిక భారం పడే ప్రమాదముంది. కాబట్టి, నియోపోలిస్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచించి.. తగు నిర్ణయం తీసుకోవాలని పలువురు బిల్డర్లు కోరుతున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0