కోకాపేట కంటే బంజారాహిల్స్ లోనే చీప్

Dec 17, 2025 - 12:04
 0  182
కోకాపేట కంటే బంజారాహిల్స్ లోనే చీప్
కోకాపేట కంటే బంజారాహిల్స్ లోనే చీప్

-      రూ.315 కోట్లకు అమ్ముడైన తాజ్ బంజారా

-      ఎకరం ధర రూ.95 కోట్లే..

-      కోకాపేటలో ఎకరం ధర రూ.170 కోట్ల పైమాటే..

రియల్ ఎస్టేట్ లో ధరలపరంగా వేగంగా దూసుకుపోతున్న కోకాపేట కంటే నగరంలో ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచిన బంజారాహిల్స్ ప్రాంతంలో ధరలు తక్కవగా ఉన్నాయా? నగరం నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్ లో ప్రాపర్టీ ధరలకు, కోకాపేటలో ప్రాపర్టీ ధరలకు దాదాపు రెట్టింపు తేడా ఉందా? అంటే.. తాజాగా జరిగిన ఓ లావాదేవీ పరిశీలిస్తే ఔననే అనిపిస్తుంది. ఇటీవల హెచ్ఎండీఏ నిర్వహించిన భూముల వేలంలో కోకాపేటలో రికార్డు స్థాయిలో ఎకరం ధర దాదాపు రూ.170 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. అదే సమయంలో తాజాగా బంజారాహిల్స్ లో నమోదైన ఓ లావాదేవీ పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. బంజారాహిల్స్ ప్రైమ్ ఏరియాలో ఉన్న తాజా బంజారా హోటల్ రూ.315 కోట్లకు అమ్ముడైంది. మూడున్నర ఎకరాల స్థలంలో ఈ హోటల్ ఉండగా.. ఎకరా ధర రూ.95 కోట్లుగా పలికినట్టయింది.  పైగా ఇందులో రెడీ టు ఆక్యుపై భవనం కూడా ఉంది. ఒకప్పుడు నగరంలోని ప్రముఖ హోటళ్లలో ఒకటిగా ఉన్న తాజా బంజారాను తాజ్ జీవీకే హోటల్స్ ఆధ్వర్యంలో దాదాపు నాలుగు దశాబ్దాల కార్యకలాపాలు జరిగాయి. 2023లో లీజు ముగిసే వరకు హోటల్ గ్రూప్ దీనిని నిర్వహించింది. తాజాగా ఆ ప్రాపర్టీని విక్రయించాలని దాని యజమాని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో అరబిందో గ్రూప్ కు చెందిన ఆరో రియల్టీ దీనిని కొనుగోలు చేయాలని ముందుకొచ్చింది. తన రియల్ ఎస్టేట్ కార్యకలాపాల కోసం రూ.2వేల కోట్లు సమీకరించుకున్న ఆరో రియల్టీ.. అందులోని మొత్తంతోనే ఈ హోటల్ ను కొనుగోలు చేసింది. గతనెల 31న రిజిస్ట్రేషన్ జరగ్గా.. స్టాంపు డ్యూటీ కింద రూ.17.3 కోట్లు చెల్లించింది. తాజా బంజారా భవనం ఇప్పటికీ వాణిజ్య విలువ కలిగి ఉన్నప్పటికీ.. దానిని కూల్చివేసి, ఆ స్థానంలో హైరైజ్ డెవలప్ మెంట్ చేపట్టాలని ఆరో రియల్టీ యోచిస్తున్నట్టు మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0