తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్దం

Telangana Future City Hosts Major Global Summit: Investment Pitch & 27 Key Sessions

Dec 7, 2025 - 08:05
 0  111
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్దం

అత్యంత ప్రతిష్టాత్మక నిర్వహణకు పూర్తిఅయిన ఏర్పాట్లు

భారీగా పెట్టుబడులకు ఆహ్వానం, ప్రభుత్వ సహకారంపై చర్చ

హాజరుకానున్న 44కు పైగా దేశాల ప్రతినిధులు

నేటి మధ్నాహ్నం సదస్సును ప్రారంభించనున్న గవర్నర్

తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్దమైంది. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అద్భుతంగా ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవాప్తంగా పేరెన్నికగల కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు.

సోమ‌వారం మధ్నాహ్నం ఒకటిన్నరకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ లాంఛనంగా సమ్మిట్ ను ప్రారంభిస్తారు. సుమారు రెండు వేల మంది దేశ, విదేశీ అతిధులు ప్రారంభవేడుకకు హాజరవుతున్నారు. 

సమ్మిట్ లో వివిధ అంశాలపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ,  ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా, తదితరులు ప్రసంగించనున్నారు. 

మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వంవైపు నుంచి అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి ఆహుతులకు వివరిస్తారు. రెండు రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్లు జరుగుతాయి. ఇందుకు వీలుగా సెమినార్ హాళ్లను అధికారులు  సిద్దం చేశారు. 

వచ్చిన అంతర్జాతీయ, దేశీయ అతిధులు, పెట్టుబడిదారులకు తెలంగాణతో పాటు హైదరాబాద్ ప్రత్యేకతలు తెలిసేలా ప్రచార సామాగ్రిని సిద్దంచేశారు. ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలో వేదిక వరకు వివిధ రూపాల్లో వీటి ప్రదర్శన ఉంటుంది. అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీ తో ప్రత్యేకంగా ప్రచార ఏర్పాట్లు జరిగాయి. లైటింగ్ ప్రొజెక్షన్, 3D ప్రాజెక్షన్ మ్యాపింగ్, ఎయిర్ పోర్టు అప్రోచ్ రోడ్ లో ఎల్ఈడీ స్క్రీన్స్ తో ఈ విభిన్న ప్రదర్శనలు ఉంటాయి. 

సబ్జెక్టులపై చర్చల తర్వాత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీత కచేరి అతిధులను అలరించనుంది. అలాగే తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గు డొల్లు, పేరిణి నాట్యం, బోనాల ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది. 

మరోవైపు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్కు అయిన బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సదస్సు జరిగే రెండు రోజుల పాటు హాజరైన అందరికీ పసందైన హైదరాబాదీ బిర్యానీతో పాటు, తెలంగాణ ప్రసిద్ద వంటలతో భోజనాలను అందించేందుకు వంటశాలలు సిద్దమయ్యాయి. 

ఇక అతిధులను తెలంగాణ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా గ్లోబల్ సమ్మిట్ డెలిగేట్లకు ప్రత్యేక సావనీర్లకు కూడిన బహుమతిని ప్రభుత్వం తరపున అందించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగో పాటు, పోచంపల్లి ఇక్కత్ శాలువా, చేర్యాల కళాకృతులు, హైదరాబాదీ అత్తర్, ముత్యాలతో కూడిన నగలను ఈ సావనీర్ లో పొందుపరుస్తారు. అలాగే తెలంగాణకే ప్రత్యేకమైన వంటలైన ఇప్ప పువ్వు లడ్డు, సకినాలు, చెక్కలు, బాదం కీ జాలి, నువ్వుల ఉండలు, మక్క పేలాలతో కూడిన మరో ప్రత్యేక బాస్కెట్ ను కూడా అతిధులకు అందించనున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0