భానూరులో మూడు వందల మంది కష్టార్జితాన్ని దోచుకున్న భారతీ బిల్డర్స్
భానూరులో మూడు వందల మంది కష్టార్జితాన్ని దోచుకున్న భారతీ బిల్డర్స్
ప్రీలాంచ్ మోసంలో కొనుగోలుదారులను దారుణంగా మోసం చేసిన భారతి బిల్డర్స్‌పై మరొక కేసు నమోదైంది. పి కిషోర్ కుమార్ అనే వ్యక్తి తాజాగా సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగానికి ఫిర్యాదు చేశారు. అతను చేసిన ఫిర్యాదు ప్రకారం.. భానూర్‌లోని భారతి బిల్డర్స్ అనే సంస్థ గ్రీన్ ఎంపైర్ హైట్స్ అనే ప్రాజెక్టును ప్రీలాంచ్‌లో ఆరంభించింది. తనతో పాటు సుమారు మూడు వందల మంది అందులో పెట్టుబడి పెట్టారని.. అయితే ఆ సంస్థ తమల్ని మోసం చేసిందంటూ కేసు పెట్టారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. భారతీ బిల్డర్స్ ఛైర్మన్ దుపాటి నాగరాజు, ఎండీ ముల్పూరి శివరామకృష్ణ, సీఈవో పొన్నారి తదితరులు.. 2021లో ప్రీలాంచ్ స్కీమ్ అంటూ ఫ్లాట్లను విక్రయించడం ప్రారంభించారు.
ఫిర్యాదుదారు పి. కిషోర్ కుమార్ (45) తెలిపిన వివరాల ప్రకారం, రియల్ ఎస్టేట్ ఏజెంట్ జి. లక్ష్మణ రావు, తాను రెరా సర్టిఫైడ్ ఏజెంట్ అని చెప్పుకుంటూ, భానూర్‌లో 6.35 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను చూపించి, అవసరమైన చట్టబద్ధ అనుమతులు మరియు హెచ్ఎండీఏ అనుమతి ప్రక్రియలో ఉన్నాయని హామీ ఇచ్చినట్లు ఫిర్యాదుదారు తెలిపారు. అతను చెప్పిన మాటల్ని పూర్తిగా నమ్మిన కిషోర్ కుమార్.. తక్కువ ధరకే వస్తుందంటే 1,150 చదరపు అడుగుల విస్తీర్ణం గల రెండు బెడ్‌రూమ్ ఫ్లాట్‌ను బుక్ చేసుకున్నారు. మొత్తం రేటులో సగం ధర అయిన రూ.11.5 లక్షలను చెల్లించారు. 2021 అక్టోబర్ 28న కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) ప్రకారం, ప్రాజెక్ట్‌ను 30 నెలల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అయితే ప్రాజెక్ట్ ప్రారంభం కాకపోవడంతో, 2023 ఏప్రిల్‌లో రీఫండ్ కోరినా, ఇప్పటివరకు డబ్బు వెనక్కి ఇవ్వలేదని పోలీసులు తెలిపారు.
ఆతర్వాత భానూరు ప్రాజెక్టులో కొంత భాగాన్ని ఇతర వ్యాపారులకు బదిలీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బిల్డర్‌ను కలిసేందుకు చేసిన ప్రయత్నాలకు బెదిరింపులు ఎదురయ్యాయని, కొంతమందికి ఇచ్చిన రీఫండ్ చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయని ఫిర్యాదుదారుడు తెలిపారు. కిషోర్ కుమార్‌తో పాటు మరో 22 మంది బాధితుల వివరాలను పోలీసులకు అందజేశారు. వీరంతా కలిపి రూ.5.39 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారని, తప్పుదారి పట్టించే బ్రోచర్లు, రెండు సంవత్సరాల్లో పెట్టుబడిని రెట్టింపు చేస్తామని చెప్పిన టీవీ ప్రకటనలు, మౌఖిక బై-బ్యాక్ హామీల ద్వారా నిందితులు మోసం చేశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా, భారతి బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దుపాటి నాగరాజు, ముల్పురి శివ రామకృష్ణ, పొన్నారి తదితరులపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 318(4) (మోసం) మరియు 316(2) (నేరపూరిత నమ్మకద్రోహానికి శిక్ష) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చెల్లింపులకు సంబంధించిన రసీదులు సహా పలు పత్రాలను పరిశీలిస్తున్నామని, అదనపు ఆధారాలు సేకరించిన అనంతరం నిందితులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0