ఫ్లాట్ అప్పగింతలో ఆలస్యం.. వాసవి రియల్టర్స్ పై జరిమానా
RERA Slaps Penalty on Vasavi Group for Delay in Flat Delivery
* కొనుగోలుదారులకు 10.7 శాతం వడ్డీ చెల్లించాలని టీజీ రెరా ఆదేశం
* వాసవి గ్రూప్ పై పదేపదే ఫిర్యాదులొస్తున్నాయన్న టీజీ రెరా
* ఇకనైనా జాగ్రత్తగా ఉండాలంటూ
వాసవిని హెచ్చరించిన టీజీ రెరా
ఫ్లాట్ల అప్పగింతలో ఆలస్యం చేసినందుకు హైదరాబాద్ నగరానికి చెందిన వాసవి సంస్థపై టీజీ రెరా జరిమానా విధించింది. హాఫీజ్‌పేట్‌లోని వాసవి లేక్ సిటీ ప్రాజెక్టులోని ఫ్లాట్ కొనుగోలుదారులకు అంగీకరించిన సమయానికి ఫ్లాట్లను అప్పగించడంలో విఫలమైనందుకు వారికి 10.70 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వాసవి లేక్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు ముప్పయ్ నాలుగు మంది దాకా హోమ్ బయ్యర్లుకు టీజీ రెరాకు ఫిర్యాదు చేశారు. వీరిలో కొందరికీ 2023 ఆగస్టులో.. మరికొందరికీ 2024లో ఫ్లాట్లను హ్యాండోవర్ చేస్తామని.. వాసవి సంస్థ అగ్రిమెంట్ చేసిందిని.. 2025 అయినా తమకు ఫ్లాట్లను హ్యాండోవర్ చేయలేదని.. వీరందరు కలిసికట్టుగా టీజీ రెరాకు ఫిర్యాదు చేశారు.
మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో నివసించే రవికుమార్ నున్న, శ్రీమతి అనసూయ సుశీల నున్నతో పాటు మరో 33 మంది హోమ్ బయ్యర్లు.. వాసవి సంస్థ ఫ్లాట్ ఆలస్యం చేసిందంటూ టీజీ రెరాకు ఫిర్యాదు చేశారు. గడువు ముగిసినా వాసవి సంస్థ ఫ్లాట్ అప్పగించలేదు. ఫిర్యాదుదారులు పదేపదే అభ్యర్థనలు చేసినా.. ఫ్లాట్ అప్పగింత విషయంలో డెవలపర్ నుంచి ఎలాంటి హామీ రాలేదు. దీంతో వీరంతా కలిసి టీజీ రెరాను ఆశ్రయించారు. ప్రాజెక్టులో వాగ్దానం చేసిన సౌకర్యాల నిర్మాణం కూడా చేపట్టలేదని, గదుల పరిమాణంలో కూడా వ్యత్యాసాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఆలస్యం తమపై తీవ్రమైన ఆర్థిక, మానసిక ఒత్తిడిని కలిగించిందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. గణనీయమైన మొత్తాలను పెట్టుబడిగా పెట్టి భారీ ఈఎంఐలతో ఇబ్బందులు పడుతున్నామని.. ఇది మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులకు కారణమైందని నివేదించారు. ఈ నేపథ్యంలో తమకు తమ ఫ్లాట్ ను తక్షణమే అప్పగించేలా ఆదేశాలివ్వడంతోపాటు ఆలస్యమైన కాలానికి జరిమానాతో సహా వడ్డీ చెల్లించేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. అలాగే గదుల పరిమాణంలో వ్యత్యాసానికి పరిహారం చెల్లించేలా ఆదేశించాలని అభ్యర్థించారు. అయితే, ఫిర్యాదుదారులు చట్ట ప్రకారం గానీ, వాస్తవాల ప్రకారం గానీ ఇది విచారణకు అర్హమైనది కాదని, దీనిని కొట్టివేయాలని వాసవి గ్రూప్ వాదించింది. ఫిర్యాదును దాఖలు చేయడానికి ముందు ఎటువంటి ముందస్తు చట్టపరమైన నోటీసు జారీ చేయలేదని పేర్కొంది. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రాజెక్టు చేపట్టామని నివేదించింది. ఒప్పందంలోని క్లాజ్ 7 ప్రకారం ఫోర్స్ మేజర్ పరిస్థితుల వల్ల కలిగే ఆలస్యం మేరకు పూర్తి చేసే కాలం పొడిగింపు అవుతుందని వాదించారు. ఈ కాలంలో కేటాయింపుదారుడు పరిహారం క్లెయిమ్ చేయడానికి అర్హులు కారని పేర్కొన్నది.
వాదనలు విన్న రెరా.. బిల్డర్ అభ్యంతరాలను తిరస్కరించింది. రెరా అమ్మకపు ఒప్పందంలోని వివాద పరిష్కార నిబంధన ఉన్నప్పటికీ, ఫిర్యాదు చెల్లుబాటు అవుతుందని పేర్కొంటూ డెవలపర్ ప్రాథమిక అభ్యంతరాన్ని తిరస్కరించింది. కరోనా తగ్గిన తర్వాత ఒప్పందం కుదిరినందున కోవిడ్-19 మహమ్మారిని ఫోర్స్ మేజర్ (అనివార్య కారణం)గా డెవలపర్ పేర్కొనడం ఆమోదయోగ్యం కాదని కూడా పేర్కొంది. ప్రతివాది తీసుకున్న రిజిస్ట్రేషన్ పొడిగింపు ఫిర్యాదుదారుడి ఒప్పంద హక్కులను నీరుగార్చదని.. అయితే, స్వాధీనం చేసుకునే తేదీ అమ్మకపు దస్తావేజు అమలు చేసిన తేదీగా ఉంటుందని స్పష్టం చేసింది. నిర్దేశిత తేదీ అంటే 26.06.2024 నాటికి సంబంధిత ఫ్లాట్‌ను స్వాధీనం చేయడంలో విఫలమైనందుకు ప్రతివాదిదే బాధ్యత అని రెరా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారులు చెల్లించిన అసలు మొత్తాలపై, 27.06.2024 నుంచి చట్టబద్ధమైన స్వాధీనాన్ని వాస్తవంగా అప్పగించే వరకు సంవత్సరానికి 10.70% వడ్డీకి అర్హులని పేర్కొంది. ఈ ఉత్తర్వు తేదీ వరకు పేరుకుపోయిన బకాయిలను అరవై రోజుల్లోపు ఫిర్యాదుదారులకు చెల్లించాలని వాసవి రియల్టర్స్ ను ఆదేశించింది. ఆ తర్వాత ఫ్లాట్ స్వాధీనం చేసే వరకు తదుపరి నెల 10వ తేదీన లేదా అంతకు ముందు నెలవారీ ప్రాతిపదికన పేరుకుపోయే వడ్డీని చెల్లించాలని సూచించింది. అలాగే ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేసి ఫిర్యాదుదారులకు అప్పగించాలని స్పష్టం చేసింది.
ఫిర్యాదుదారులు అంగీకరించిన చెల్లింపు షెడ్యూల్ ప్రకారం బ్యాలెన్స్ మొత్తాన్ని ఖచ్చితంగా చెల్లించాలని పేర్కొంది. ఒకవేళ అటువంటి షెడ్యూల్‌కు కట్టుబడి ఉండటంలో ఏదైనా డిఫాల్ట్ జరిగితే, తెలంగాణ రియల్ ఎస్టేట్ (నియంత్రణ మరియు అభివృద్ధి) నియమాలు, 2017లోని నియమం 15 ప్రకారం ఆలస్యమైన మొత్తాలపై వడ్డీని క్లెయిమ్ చేయడానికి స్వేచ్ఛ ఉంటుందని ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పదేపదే ఉల్లంఘనలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఇకపై జాగ్రత్తగా ఉండాలని వాసవి రియల్టర్స్ ను టీజీ రెరా హెచ్చరించింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0