హైటెక్ సిటీలో ఫేస్ బుక్ మరో లీజు
Facebook Takes Another Office Lease in Hyderabad’s Hitech City
* 69,702 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ కు రూ.67 లక్షల అద్దె
* ఐదేళ్ల కాలానికి లీజుకు తీసుకున్న సంస్థ
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఇండియా.. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో దాదాపు 69,702 చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని ఐదేళ్ల పాటు లీజుకు తీసుకుంది. ఇందుకు నెలవారీ రూ.67 లక్షల అద్దె చెల్లించనుంది. దీనికి సంబంధించిన లీజు ఒప్పందం మహంగా కమర్షియల్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెటా భారతీయ విభాగమైన ఫేస్బుక్ ఇండియా ఆన్లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య కుదిరినట్టు సీబీఆర్ఈ వెల్లడించింది. ది స్కైవ్యూ కాంప్లెక్సులోని స్కైవ్యూ 20 భవనంలో ఈ స్పేస్ ఉంది. ఈ లీజు డిసెంబర్ 2, 2025న నమోదు కాగా, అద్దె చెల్లింపు డిసెంబర్ 18, 2025 నుంచి ప్రారంభమైంది. అయితే లీజు కాలం జూలై 18, 2025 నుండి ఐదేళ్ల పాటు అమల్లోకి వస్తుందని పత్రాలు చూపించాయి. ఈ కార్యాలయ స్థలం నాలుగో అంతస్తులో ఉంది. దీంతో 70 కార్ పార్కింగ్ స్లాట్లు వస్తాయి. ఈ లావాదేవీ కోసం ఫేస్బుక్ ఇండియా రూ.4.01 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌ను చెల్లించింది. ఒప్పందం ప్రకారం, మూడేళ్ల తర్వాత అద్దె 15% పెరుగుతుంది. కాగా, 2024లోఫేస్బుక్ హైదరాబాద్‌లోని 3.7 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని రెండు వేర్వేరు లావాదేవీల ద్వారా నెలకు రూ.2.8 కోట్ల అద్దెకు పునరుద్ధరించుకుంది. ఈ కార్యాలయం నగరంలోని ప్రధాన ఐటీ కారిడార్లలో ఒకటైన హైటెక్ సిటీలోని ది స్కైవ్యూలో ఉంది. డిసెంబర్లో పునరుద్ధరించిన లావాదేవీ కోసం కంపెనీ 84,053 చదరపు అడుగుల స్థలానికి రూ.65.7 లక్షల అద్దె చెల్లించింది. అదే సంవత్సరం ఏప్రిల్‌లో పునరుద్ధరించిన మరో లావాదేవీలో ఫేస్బుక్ 2.8 లక్షల చదరపు అడుగుల స్థలానికి నెలకు రూ.2.15 కోట్ల అద్దె చెల్లించింది. లీజు మొత్తం కాలపరిమితి ఐదేళ్లు. కంపెనీ మొత్తం రూ.16.8 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0