ప్రణీత్ సంస్థ ఆరేళ్ల దగా.. లేని ఫ్లాటుకు ఈఎంఐ చెల్లిస్తున్న బయ్యర్లు
Praneeth Ambience Puppalguda: Homebuyers Pay EMIs Without Flats, Demand TG RERA Action
* పొప్పాల్ గూడలో ప్రణీత్ సంస్థ దారుణం
* 200 మంది బయ్యర్లు, ఇన్వెస్టర్ల నుంచి సొమ్ము వసూలు
* ఆరేళ్లయినా పూర్తి కాని నిర్మాణం..
* మూడేళ్ల నుంచి లేని అపార్టుమెంట్‌కు ఈఎంఐలు
* ఎప్పుడు పూర్తవుతుందో తెలియని దుస్థితి..
* గగ్గోలు పెడుతున్న అమాయక కొనుగోలుదారులు
* టీజీ రెరా బాధితులకు న్యాయం చేయాలి
గతేడాది హైదరాబాద్‌లోని బాచుపల్లిలో వాసవి గ్రూప్ బయ్యర్ల ఆందోళన తర్వాత 2026లో తాజాగా ప్రణీత్ సంస్థకు సంబంధించిన కొనుగోలుదారులు పొప్పాల్‌గూడలో ఆందోళన నిర్వహించారు. ఇందులో కొన్న బయ్యర్ల పరిస్థితి అయితే మరీ దారుణం. 2020లో సొమ్ము కట్టినా ఇప్పటివరకూ నిర్మాణమే పూర్తి కాలేదు. అసలెప్పుడు పూర్తవుతుందో కూడా తెలియదు. కొనుగోలుదారులు ఎంత హీనస్థితిలో ఉన్నారంటే.. అసలు నిర్మాణమే కాని అపార్టుమెంట్‌కు.. నెలసరి గృహరుణాన్ని కూడా కడుతున్నారు. అయ్యో అదేంటీ.. లేని ఫ్లాటుకు ఈఎంఐ కడుతున్నారా? ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు కదా.. మరి, హైదరాబాద్‌లో బయ్యర్లను ఇంతగా ఇబ్బంది పెడుతున్నా ఆ సంస్థ పేరేంటి? ఈ అపార్టుమెంట్‌ను ఎక్కడ ప్లాన్ చేశారు? ఆ వివరాలేమిటో ఇప్పుడు చూసేద్దాం.
నిధుల దారి మళ్లింపు
హైదరాబాద్‌లో కొందరు బయ్యర్లు ఎంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారంటే.. లేని ఫ్లాట్‌కు బ్యాంకుకు నెలసరి ఈఎంఐ కడుతున్నారు. ఒకవైపు అద్దె ఇళ్లల్లో ఉంటూనే సుమారు మూడు సంవత్సరాల నుంచి ఇలా కడుతున్నారు. మరి, వీరిని ఇంతగా ఇబ్బంది పెడుతున్న ఆ సంస్థ పేరు.. ప్రణీత్ కాన్సెప్ట్స్ అండ్ డెవలపర్స్. బిల్డర్ పేరు.. పీఎన్ సురేష్. పొప్పాల్‌గూడలోని ప్రణీత్ యాంబియెన్స్ ప్రాజెక్టును 2020లోనే ఆరంభించినా.. కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన సొమ్మును దారి మళ్లించడంతోనే ఈ సమస్య ఏర్పడిందని తెలిసింది. ఈ ప్రాజెక్టు కోసం వసూలు చేసిన సొమ్మును ఇతర ప్రాజెక్టుల కోసం వాడుకోవడం వల్లే.. ప్రస్తుత ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతున్నాడని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై కంపెనీ ఎండీ వివరణ కోసం సంస్థకు ఆర్ఈజీ న్యూస్ ప్రతినిధి కాల్ చేయగా.. ఎలాంటి జవాబు రాకపోవడం గమనార్హం.
115 బదులు 120 మందికి?
బిల్డర్ ఏ నుంచి జి బ్లాకులను కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో వాస్తవంగా కట్టాల్సింది 115 ఫ్లాట్లే కాగా.. కానీ, ఈ బిల్డర్ ఏం చేశాడంటే.. నూట నలభై ఒక్క మందికి అమ్మేశాడు. అంతేకాదు, ప్రతి ఫ్లోరులో అదనంగా అంతస్తుల్ని వేసేశాడు. అంటే, మున్సిపల్ అధికారులేం చేస్తారులే అని అనుకుని సుమారు 26 ఫ్లాట్లను అక్రమంగా నిర్మించాడు. మొత్తం నూట నలభై ఒక్క మంది నుంచి మొత్తం సొమ్ము వసూలు చేశాడీ బిల్డర్. అయితే, ఇందులో కొనుగోలుదారుల సమాచారం ప్రకారం.. సుమారు నూటయాభై మంది నుంచి వారి కష్టార్జితాన్ని వసూలు చేశాడని.. అంతేకాకుండా, మరో యాభై మంది ఇన్వెస్టర్ల నుంచి కూడా అదనంగా సొమ్ము తీసుకున్నాడని తెలిసింది.
బిల్డర్‌ను జైల్లో పెట్టాలని డిమాండ్
సుమారు రెండు వందల మంది అమాయకుల కష్టార్జితంతో ఆటాడుకుంటున్న ఇలాంటి బిల్డర్లపై టీజీ రెరా కఠిన చర్యల్ని తీసుకోవాలి. ఆరేళ్ల నుంచి ప్రాజెక్టును పూర్తి చేయకుండా.. అమాయక ప్రజలతో ఆటాడుకుంటున్నందుకు.. పీఎన్ సురేష్ లాంటి బిల్డర్లను జైల్లో పెట్టాలి. అప్పుడే, తెలంగాణ రాష్ట్రంలో ఏ బిల్డర్ కూడా ఇలా ప్రజలను మోసం చేయడానికి సాహసం చేయరు. మరి, ఇప్పటికైనా టీజీ రెరా ఈ కేసును సుమోటాగా స్వీకరించి.. ప్రాజెక్టును పూర్తిగా హ్యాండోవర్ చేసుకుని.. నిర్మాణ పనుల్ని పూర్తి చేసి.. కొనుగోలుదారుల సొంతింటి కలను సాకారం చేయాలి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0