గాల్లో ఫ్లాట్ల‌ను అమ్మిన ప్ర‌ణీత్?

గాల్లో ఫ్లాట్ల‌ను అమ్మిన ప్ర‌ణీత్

Feb 10, 2026 - 18:12
 0  0
గాల్లో ఫ్లాట్ల‌ను అమ్మిన ప్ర‌ణీత్?

* గ‌గ్గోలు పెడుతున్న బ‌య్య‌ర్లు
* లేని ఫ్లోరులో ఫ్లాట్ల విక్ర‌యం
* ఒక్కో ఫ్లాటును ఇద్ద‌రికి అమ్మ‌కం

* మూడు బ్లాకులు పూర్త‌యినా..
  ఇంత‌వ‌ర‌కూ హ్యాండోవ‌ర్ చేయ‌లేదు
* మిగ‌తా బ్లాకుల‌కు అనుమ‌తుల్లేవు
* బిల్డ‌ర్‌ను ప్ర‌శ్నిస్తున్న కొనుగోలుదారులు


పాపం.. వారంతా సామాన్య‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లే.. కొన్నేళ్ల నుంచి క‌ష్ట‌ప‌డి.. తినీ తిన‌క‌.. దాచుకున్న సొమ్ముతో.. బ్యాంకు రుణం తీసుకుని.. అది చాల‌క‌.. అప్పోసొప్పో చేసి.. బంధుమిత్రుల నుంచి చేబ‌దులో తీసుకునో.. త‌మ‌కంటూ హైద‌రాబాద్లో శాశ్వ‌త నివాసం ఉంటుంద‌నే ఉద్దేశ్యంతో.. ల‌క్ష‌ల రూపాయ‌లు తెచ్చి బిల్డ‌ర్ చేతిలో సొమ్ము పోశారు. రెండు, మూడేళ్లు వేచి చూస్తే ఎంచ‌క్కా గృహ‌ప్ర‌వేశం చేసేయ‌వ‌చ్చ‌ని క‌ల‌లు కంటున్న వారికి.. ప్ర‌ణీత్ బిల్డ‌ర్ ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపిస్తున్నాడు. నిర్మాణ ప‌నులు నిలిచిపోవ‌డంతో ఏం చేయాలో అర్థం కాక‌.. ప్ర‌తి ఆదివారం సైటు వ‌ద్ద‌కొచ్చి ధ‌ర్నా చేస్తున్నారు. అయినా, బిల్డ‌ర్ నుంచి సరైన స‌మాధానం రాక‌పోవ‌డంతో మాన‌సిక వేద‌న‌ను అనుభ‌విస్తున్నారు. కొంత‌కాలం నుంచి నిద్ర‌లేని రాత్రుల్ని గ‌డుపుతున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

దాదాపు ఆరేళ్ల క్రితం.. ప్ర‌ణీత్ సంస్థ పుప్పాల్‌గూడ‌లో ప్ర‌ణీత్ యాంబియెన్స్ అనే ప్రాజెక్టును ప్రారంభించింది. అప్ప‌ట్లో చ‌ద‌ర‌పు అడుక్కీ మూడు వేల రూపాయ‌ల చొప్పున ఫ్లాట్ల‌ను విక్ర‌యించింది. మంచి లొకేష‌న్‌.. పైగా రేటు త‌క్కువ‌.. మూడేళ్ల‌లోనే పూర్త‌వుతుంది.. ఇంత‌కంటే త‌క్కువ‌కు ఫ్లాట్లు రావనే ఉద్దేశ్యంతో.. సుమారు నూట‌యాభై మంది దాకా ఫ్లాట్ల‌ను కొనుగోలు చేశారు.
విస్తుగొలిపే విష‌యం ఏమిటంటే.. ఈ ప్రాజెక్టులో ఒకే ఫ్లాటును ఇద్ద‌రిద్ద‌రికీ కూడా విక్ర‌యించార‌ని స‌మాచారం. చెప్పిన స‌మ‌యానికి ఫ్లాట్ల‌ను బిల్డ‌ర్ పూర్తి చేయ‌క‌పోవ‌డంతో.. అందులో కొన్న‌వారంతా ల‌బోదిబో మంటున్నారు. కూడ‌బెట్టిన పైస‌లన్నీ తెచ్చి ఇందులో ఫ్లాటు కోసం వెచ్చించామ‌ని.. ఇప్పుడు ఫ్లాటు రాక‌పోవ‌డంతో ఏం చేయాలో అర్థంకావ‌డం లేద‌ని.. బ‌య్య‌ర్లు త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. మ‌రికొంద‌రేమో ఈ ఫ్లాటుకు ఈఎంఐ చెల్లించ‌లేక‌.. ఇప్పుడున్న ఇంటికి అద్దె క‌ట్ట‌లేక.. న‌ర‌కం అనుభ‌విస్తున్నామ‌ని వాపోతున్నారు. ఆర్థికంగా ఎంతో చితికిపోతున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

డ‌బ్బుల‌న్నీ ఏం చేశాడు?
బ‌య్య‌ర్ల నుంచి వ‌సూలు చేసిన సొమ్ముతో బిల్డ‌ర్ అపార్టుమెంట్ల‌ను నిర్మించ‌కుండా ఏం చేశాడ‌ని ఆర్ఈజీ టీవీ కొనుగోలుదారుల‌ను ప్ర‌శ్నించ‌గా.. త‌మ వ‌ద్ద తీసుకున్న సొమ్మును దారి మ‌ళ్లించాడ‌నే కొంద‌రు అభిప్రాయ‌ప‌డ్డారు. పైగా, బిల్డ‌ర్ కొడుకు విలాసాల కోసం కొంత సొమ్మును వినియోగించి ఉంటార‌నే ఆరోప‌ణ‌లు వినిపించాయి. వీరి మాట‌ల్ని గ‌మ‌నిస్తే.. బిల్డ‌ర్ లేని ఫ్లాటును ఉన్న‌ట్టుగా చూపెట్టి కొంద‌రికి ఫ్లాట్ల‌ను అమ్మాడ‌ని అర్థ‌మైంది. ఏడో అంత‌స్తులో ఫ్లాట్ అంటూ ఒక వ్య‌క్తికి 2020లో వంద శాతం సొమ్ము తీసుకుని బిల్డ‌ర్ విక్ర‌యించాడు. అస‌లక్క‌డ ఏడో అంత‌స్తుకు ప‌ర్మిష‌నే లేదు.. రాద‌ని తెలుసు.. అయినా కూడా ఏడో ఫ్లోరులో ఫ్లాటును బిల్డ‌ర్ అమ్మాడ‌ని ఒక బ‌య్య‌ర్ ఆర్ఈజీ టీవీకి వివ‌రించారు.

ఎంద‌రికి అమ్మాడో?
బ‌య్య‌ర్లు చెబుతున్న మాట‌ల్ని గ‌మ‌నిస్తే.. కొన్ని ఫ్లాట్ల‌ను ఒక‌రు కంటే ఎక్కువ మందికి బిల్డ‌ర్ విక్రయించాడ‌ని అర్థ‌మ‌వుతోంది. బ‌య్య‌ర్లు కూడా ఇదే అంశాన్ని ప‌దే ప‌దే లేవ‌నెత్తుతున్నారు. కొంద‌రు పూర్తి స్థాయి సొమ్ము చెల్లించినా.. త‌మ ఫ్లాటు ఎక్క‌డా అంటూ నిల‌దీస్తున్నారు. అయినా, బిల్డ‌ర్ నుంచి ఎలాంటి జవాబు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న పూర్తిగా మేనేజ‌ర్ మీదే ఆధార‌ప‌డ్డాడ‌ని.. ఆయా మేనేజ‌ర్ బిల్డ‌ర్‌కు తెలియ‌కుండా ఎన్ని ఫ్లాట్ల‌ను విక్ర‌యించారో తెలియ‌ద‌ని బ‌య్య‌ర్లు ఆరోపిస్తున్నారు. మొత్తానికి, పుప్పాల్‌గూడ‌లో ప్రణీత్ సంస్థ చేతిలో దారుణంగా మోస‌పోయామ‌ని కొనుగోలుదారులు వాపోతున్నారు.

* ఈ ప్రాజెక్టులో మొద‌టి మూడు బ్లాకుల‌ను బ‌య‌ట్నుంచి గ‌మ‌నిస్తే.. నిర్మాణం పూర్త‌యిన‌ట్లు క‌నిపిస్తోంది. అందులో ఇంట‌ర్న‌ల్ ప‌నులు చేయ‌క‌పోతే గ‌న‌క.. వాటిని పూర్తి చేసి బ‌య్య‌ర్ల‌కు హ్యాండోవ‌ర్ చేయాల‌ని కొంద‌రు బ‌య్య‌ర్లు కోరుతున్నారు. మిగ‌తా మూడు బ్లాకుల‌కు సంబంధించిన ప్ర‌భుత్వ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి.. బ్యాంకు రుణ‌మో.. ప్రాజెక్టు ఫండింగో తీసుకుని.. నిర్మాణ ప‌నుల‌ను పూర్తి చేసి బ‌య్య‌ర్ల‌కు హ్యాండోవ‌ర్ చేస్తే ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు బిల్డ‌ర్ చిత్త‌శుద్ధితో ప్ర‌య‌త్నిస్తే.. బ‌య్య‌ర్లూ అర్థం చేసుకుని స‌హ‌క‌రిస్తారు. కాక‌పోతే, ప్ర‌ణీత్ బిల్డ‌ర్ నిజాయితీగా వ్య‌వ‌హ‌రించి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డంపై దృష్టి పెట్టాలి. అంతేత‌ప్ప‌, ల‌క్ష‌లు పోసి ఫ్లాట్ల‌ను కొన్న‌వారిని త‌ప్ప‌దోవ ప‌ట్టించ‌కూడ‌దు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0