ఓఆర్ఆర్ - ట్రిపుల్ ఆర్ ప‌ద‌హారు గ్రీన్ ఫీల్డ్ రోడ్లు

Telangana plans 16 greenfield roads between ORR and RRR to boost connectivity, townships and Hyderabad real estate growth under the 2050 master plan.

Dec 27, 2025 - 01:29
 0  5
ఓఆర్ఆర్ - ట్రిపుల్ ఆర్ ప‌ద‌హారు గ్రీన్ ఫీల్డ్ రోడ్లు
orr-to-rrr-greenfield-roads-hyderabad-real-estate-growth
హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ దాకా.. సుమారు 10,050 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల వ‌ర‌కూ విస్త‌రించాల‌న్న ల‌క్ష్యాన్ని ప్ర‌భుత్వం నిర్దేశించుకుంది. ఈ క్ర‌మంలో మొత్తం పద‌కొండు జిల్లాల‌కు హెచ్ఎండీఏ కార్య‌క‌లాపాల్ని పెంచేసింది. హైదరాబాద్ సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ 2050లో భాగంగా.. ఆర్థికాభివృద్ధి, సమగ్ర పట్టణ ప్రజారవాణా వ్యవస్థ, జలవనరులు, అడవుల సంరక్షణకు ప్రత్యేక ప్రణాళికల్ని రూపొందిస్తుంద‌ని స‌మాచారం. ఇందులో భాగంగానే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకూ.. మొత్తం 16 గ్రీన్ ఫీల్డ్ రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాంప్రహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌లో భాగంగా.. ఓఆర్‌ఆర్‌-ట్రిపుల్ ఆర్ ల‌ మధ్య  ప‌ద‌హారు గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్ల నిర్మాణానికి అధికారులు ప్ర‌తిపాద‌న‌ల్ని సిద్ధం చేశారు. ప్రస్తుతం రావిర్యాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఆమన్‌గల్‌ వరకు 41 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మొట్ట మొదటి గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్డుతో పాటు బుద్వేల్‌ నుంచి కోస్గి వరకు సుమారు 81 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రెండో గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్డు డీపీఆర్‌ను హెచ్ఎండీఏ రూపొందించే ప‌నిలో ప‌డింది. ఇప్పటికే ఈ మార్గాల్లో గ్రీన్ ఫీల్డ్ రోడ్లకు అవసరమైన భూసేకరణకు హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ను‌ విడుదల చేసింది. ఓఆర్ఆర్‌ ఎగ్జిట్ నెంబర్ 17 వద్ద బుద్వేల్‌ నుంచి రీజినల్‌ రింగ్‌ రోడ్డు వెలుపల ఉన్న కోస్గి వరకు నిర్మించనున్న ఈ గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్డును టీజీఐఐసీ పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ 167వ జాతీయ రహదారికి అనుసంధానం చేస్తార‌ని స‌మాచారం.

కొత్త‌గా ప్ర‌తిపాదిస్తున్న గ్రీన్ ఫీల్డ్ రోడ్ల మీదుగా పారిశ్రామిక కేంద్రాలు, లాజిస్టిక్స్ హ‌బ్‌ల‌కు సులువుగా రాక‌పోక‌లు జ‌ర‌గాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్యం. ఈ మేరకు బుద్వేల్‌ నుంచి చందన్‌ వెల్లి, పేరారం, గూడూరు, దోర్నాలపల్లి, దోమ తదితర ప్రాంతాల మీదుగా కొడంగల్ వ‌ర‌కూ నిర్మిస్తారు. సుమారు 81 కిలోమీటర్ల మేర ఈ గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్డులో హెచ్‌ఎండీఏ పరిధి 52 కిలోమీటర్ల వరకే ఉంటుంది. అయితే ఈ రోడ్డు నిర్మాణానికి కొందరు రైతులు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా మరి కొందరు రైతులు పరిహారాన్ని పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి అంశాల్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని డీపీఆర్‌ను రూపొందించే ప‌నిలో హెచ్ఎండీఏ అధికారులు నిమ‌గ్న‌మ‌య్యారు. 
* ఈ రెండు రోడ్లతో పాటు మరో 14 చోట్ల ఈ తరహా రోడ్లును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ సిటీలోని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నుంచి ఔటర్‌ రింగ్ రోడ్డు మీదుగా నేరుగా ట్రిపుల్‌ ఆర్‌ వరకు చేరుకునేలా ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్‌ ఆర్ దాకా.. భారీ టౌన్ షిప్పుల‌ను ఏర్పాటు చేయ‌డానికి తెలంగాణ ప్రభుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. 2047 నాటికి రీజినల్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ సుమారు 3.5 లక్షల ఇళ్లను నిర్మించి.. ప్రతి ఒక్కరికీ గృహవసతి కల్పించాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0