చెరువుల సర్వే.. ఎప్పుడు పూర్తయ్యేను?
Hyderabad HMDA lakes re-survey progresses as Telangana govt fixes FTL & buffer zones. 3,500 lakes, including 920 in Hyderabad, are surveyed using satellite imagery & advanced tech. Officials aim to prevent encroachments, restore lakes, and complete re-survey by December end.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో చేపట్టిన చెరువులను రీ సర్వే నత్తనడకన సాగుతోంది. హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల హద్దులపై హైకోర్టు ఆదేశించేంత వరకు పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం.. హడావుడిగా సర్వే చేసి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఫిక్స్ చేసే పనిలో పడింది. హెచ్ఎండీఓ పరిధిలోని చెరువుల విస్తీర్ణం గుర్తించేందుకు ఏడాది క్రితం సర్వే మొదలు పెట్టిన రేవంత్ సర్కార్.. చెరువులు, జలాశయాల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధి, విస్తీర్ణం పక్కాగా తేల్చాలని నిర్ణయించారు. అయితే చెరువుల సర్వే ప్రక్రియ అనుకున్నంతా వేగంగా సాగడం లేదన్న టాక్ వినిపిస్తోంది. నీటి పారుదల, రెవెన్యూ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, సర్వే అండ్ సెటిల్ మెంట్ డిపార్ట్ మెంట్ అధికారులు చెరువుల సర్వే పనుల్లో నిమగ్నమయ్యారు.
చెరువుల సర్వే కోసం అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానాన్ని, పరికరాలను ఉపయోగిస్తున్నారు. సర్వే పూర్తయిన తరువాత అధికారిక వెబ్ సైట్లో హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల వివరాలను పొందుపరచనున్నారు. హైదరాబాద్ లో చెరువులు, హైడ్రా వ్యవస్థ, మూసీ ప్రాజెక్టు అంశాలపై తెలంగాణ చాలా సీరియస్ గా కసరత్తు చేస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలో పెద్దా చిన్నా కలిపి మొత్తం 3500 చెరువులుండగా, హైదరాబాద్ పరిధిలో 920 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో చాలావరకు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను గుర్తించలేదు. కొన్నింటికి ప్రాథమికంగా నోటిఫికేషన్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయం 2014 వరకే 225 చెరువులు పూర్తిగా కబ్జాకు గురయ్యాయి. మరో 196 చెరువుల భూములు పాక్షికంగా కబ్జాలకు గురయ్యాయని అధికారులు గుర్తించారు. 499 చెరువులలో ఎలాంటి కబ్జాలు, ఆక్రమణలు జరగలేదని అధికారులు తెలిపారు.
గత పదేళ్లలో 2014 నుంచి 2023 వరకు మరో 20 చెరువులు, కుంటలు పూర్తిగా కబ్జా చేశారు. గతంలో పాక్షికంగా ఆక్రమణలకు గురైన మరో 24 చెరువులు పూర్తిగా కబ్జా అయ్యాయి. మరో 127 చెరువుల భూముల్ని వీలైనంత వరకు ఆక్రమించుకున్నారని శాటిలైట్ ఇమేజ్ ల ద్వారా నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించారు. ఇక మిగతా ప్రతి చెరువులో 60 శాతం ఆక్రమణకు గురైనట్లు హైడ్రా అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు చెరువులన్నింటి చరిత్రను బయటకు తీస్తున్నారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఉపగ్రహ చిత్రాలతో ప్రస్తుతం ఉన్న చెరువులను సరిచూస్తోంది. అయితే హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు, జలాశయాల సర్వే అనుకున్నంత సజావుగా సాగడం లేదని తెలుస్తోంది. హెచ్‌ఎండీఏ పరిధిలో చెరువుల హద్దుల నిర్ధారణ నత్తనడకన సాగుతోంది. మార్చి మొదటి వారంలోనే చెరువులన్నింటికీ బఫర్, ఎఫ్‌టీఎల్ హద్దుల నిర్ధారణ పూర్తి చేయాల్సి ఉంది. కానీ, ఇప్పటికీ 50 శాతం కూడా పూర్తి చేయలేకపోయరని అధికారిక వర్గాల సమాచారం. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలను ఉన్నాతాధికారులు సైతం సమన్వయం చేయలేకపోతున్నారని చెబుతున్నారు.
నగరంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఎలాంటి పరిశీలనలు చేయకుండా.. భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంతోనే అక్రమాలు జరుగుతున్నాయని అధికారుల పరిశీలనలో తేలింది. ఒక సర్వే నంబర్‌ను తీసుకుని, మరో సర్వే నంబరులో భవనాలు నిర్మిస్తున్న విషయం హైడ్రా గుర్తించింది. ఇలాంటివి పునరావృత్తం కాకుండా రియల్ టైం లొకేషన్ వ్యవస్థను తీసుకు రావడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఒక సర్వే నంబర్‌ను కొడితే, దాని ఫొటోతో సహా క్షేత్రస్థాయిలో కో-ఆర్డినేట్స్ అధికారులకు తెలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా నిరోధించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆక్రమణలకు గురైన చెరువులను తిరిగి పునరుద్ధరించడానికి హైడ్రా రంగంలోకి దిగింది. మరో వైపు ఇప్పటికే కూల్చివేతలు చేపట్టిన చెరువుల సుందీరకరణను పనులను కొన్ని చోట్ల మొదలు పెట్టారు. ఈ క్రమంలో బతుకమ్మ కుంట చెరువును పునరుద్దరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు మీదుగా ప్రారంభించారు. ఇక డిసెంబర్ చివరి నాటి వరకు మిగతా చెరువుల రీ సర్వే పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0