ప్ర‌పంచ ‌దృష్టిని ఆక‌ర్షిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047..

Telangana Rising 2047 steals global spotlight with massive investments at the Telangana Global Summit 2025. Big industries, global CEOs, and Hyderabad real estate impact.

Dec 7, 2025 - 00:37
 0  20
ప్ర‌పంచ ‌దృష్టిని ఆక‌ర్షిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047..
telangana-rising-2047-global-summit-investments-impact-hyderabad-real-estate

* అజ‌య్ దేవ‌గ‌ణ్‌, సల్మాన్‌ఖాన్ స్టూడియోలు
* వెయ్యి ఎక‌రాల్లో సింగ‌పూర్ సెంబ్‌కార్ప్
* హిందుస్థాన్ యూనీలివ‌ర్ ప‌రిశ్ర‌మ ఏర్పాటు
* హాజ‌ర‌య్యేవారిలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌‌‌‌‌‌‌‌..

* ట్రంప్ మీడియా డైరెక్ట‌ర్‌.. ఆనంద్ మ‌హీంద్రా
* యూఏఈ రాయ‌ల్ ఫ్యామిలీ స‌భ్యులు
* ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ, రాహుల్ గాంధి

తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడు అందరి చూపును ఆకర్షిస్తోంది. భారీ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్–2025 జరుగుతోంది. ఈనెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సు ద్వారా పెట్టుబడులను సాధించడమే కాకుండా, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచవ్యాప్తం చేసేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సుమారు మూడు వేల మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు, 500 సంస్థలు ఈ సదస్సులో పాల్గొంటున్నాయి. దీంతో, ఫ్యూచర్ సిటీలో భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నాయని అంచనా.

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో రానున్న‌ రెండున్నర దశాబ్దాల తెలంగాణ ప్రస్థానాన్ని తెలియజేసేలా తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో కీలక డాక్యుమెంట్‌ను ప్ర‌భుత్వం ఆవిష్కరించనుంది. జాతీయ వృద్ధి లక్ష్యాలకు తగ్గట్టుగా, వికసిత్ భారత్ 2047 స్ఫూర్తితో ఈ రోడ్‌‌‌‌ మ్యాప్‌ను‌‌‌‌ రూపొందించారు. పెట్టుబడులంటే కేవలం వ్యాపారం మాత్రమే కాదు, ఇక్కడి జీవన విధానం, సురక్షితమైన వాతావరణం కూడా ముఖ్యమేనని తెలంగాణ ప్రభుత్వం చెప్ప‌నుంది. భారత్‌లో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే తెలంగాణ రాష్ట్రం వారి మొదటి ఛాయిస్ కావాలనే లక్ష్యంతో ఈ సమిట్ డిజైన్ చేశారు. గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌‌‌‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని వనరులు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయని ప్రపంచానికి తెలియ చెప్పడమే ప్రధాన ఉద్దేశంగా ఈ గ్లోబల్ సమ్మిట్ ను ప్రభుత్వం నిర్వహిస్తోంది.

తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా ఎలా మారిందో రాష్ట్ర ప్ర‌భుత్వం వివరించనుంది. ఇక్కడి ఫార్మా ఎకో సిస్టమ్ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా గుర్తింపు పొందింది. ఐటీ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్ రంగాల్లో హైదరాబాద్‌‌‌‌కు ఉన్న సానుకూలతలను ప్రభుత్వం ప్రముఖంగా ప్రస్తావించనుంది. విస్తారమైన భూములు అందుబాటులో ఉండటం, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, నాణ్యమైన రోడ్లు, మౌలిక వసతులు, 24 గంటల విద్యుత్ సరఫరాలాంటి అంశాలను ఇన్వెస్టర్లకు వివరిస్తారు. ప్రభుత్వం తరఫున అందించే రాయితీలు, సులభతర వాణిజ్య విధానాలులాంటివి, పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా రూపొందించిన ప్రజెంటేషన్లు సదస్సులో హైలైట్‌‌‌‌గా నిలవనున్నాయి. అన్ని శాఖల నుంచి రెండేళ్ల సక్సెస్ స్టోరీస్‌‌‌‌ తోపాటు రానున్న 22 ఏళ్ల ప్రగతి ప్లాన్‌‌‌‌ను వివరించేలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తారు.

ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడుల కోసం సింగపూర్‌కు చెందిన సెంబ్‌కార్ప్‌ ఆసక్తి చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా సౌర, ఇతర సాంప్రదాయేతర విద్యుత్‌ రంగంలో పేరుపొందినఈ కంపెనీ.. మురుగునీటి శుద్ధీకరణ , మౌలిక వసతుల అభివృద్ధి లాంటి పట్టణాభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతోంది. భారత్‌ లో పలు రాష్ట్రాల్లో విద్యుత్‌ ప్రాజెక్టుల్ని నిర్వహిస్తోంది. తాజాగా సెంబ్‌కార్ప్‌ తెలంగాణపై దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వంతో సెంబ్‌కార్ప్‌ చర్చలు ప్రారంభించింది. ఫ్యూచర్‌ సిటీలో వెయ్యి ఎకరాలు కేటాయిస్తే.. తమతో పాటు సింగపూర్‌కు చెందిన మరిన్ని కంపెనీలు పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయని ప్రతిపాదించింది. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తే.. తెలంగాణ రైజింగ్‌ సదస్సులో ఒప్పందం కుదుర్చుకోనుంది. పెట్టుబడుల ప్రణాళిక, ఉద్యోగాల కల్పనపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశముంది. ఇక ప్రఖ్యాత హిందూస్థాన్‌ యూనిలీవర్‌ సంస్థ కూడా ఫ్యూచర్‌ సిటీలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

                                                                                      


గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి దేశ, విదేశాలకు చెందిన సుమారు మూడు వేల మందికి పైగా దిగ్గజ పారిశ్రామికవేత్తలు, వాణిజ్య ప్రముఖులను ప్ర‌భుత్వం ఆహ్వానించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న రాజకీయ నాయకులు, టెక్‌‌‌‌ దిగ్గజాలు, భారీ కంపెనీల సీఈవోలు ఈ జాబితాలో ఉన్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌‌‌‌‌‌‌‌ మొదలు.. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, భారతీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యుల వరకు ఎందరో ప్రముఖులు గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొననున్నారు. ఈ అంతర్జాతీయ వేదికకు మరింత వన్నె తెచ్చేలా ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.



భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేసేందుకు ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ముందుకొచ్చారు. గ్లోబల్ సమ్మిట్ లోనే ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు. ఇప్పటికే మరో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు ఫిల్మ్ సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇక్కడ భూమి కేటాయించింది. ఇక ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ గ్రూప్ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. రిలయన్స్‌కు చెందిన వంతారా యానిమల్ రెస్క్యూ సెంటర్, వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ, నైట్ సఫారీని ఏర్పాటు చేయడానికి సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది.

 ఫ్యూచర్ సిటీలోని 15,000 ఎకరాల అటవీ ప్రాంతంలో లేదా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దీన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు రాష్ట్ర పర్యాటక రంగానికి కొత్త ఊపు ఇస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. వీటితో పాటు విలాసవంతమైన కేటరింగ్ సేవలకు పేరుగాంచిన ఫుడ్ లింక్ ఎఫ్ అండ్ బీ హోల్డింగ్స్ కంపెనీ రూ. 3,000 కోట్ల పెట్టుబడితో ఫ్యూచర్ సిటీలో మూడు స్టార్ హోటళ్లను నిర్మించనుంది. దీనికి సంబంధించిన ఒప్పందం కూడా సదస్సులోనే జరగనుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0