16 నెలలైనా ఎల్ఆర్ఎస్ నత్తనడక..
Confusion and technical issues plague LRS in Telangana. Despite fee payment, proceedings are delayed, worrying Hyderabad real estate stakeholders.
* ఎల్ఆర్ఎస్ గందరగోళం..
* సాంకేతిక సమస్యలు ఎక్కువ
* ఫీజు చెల్లించినా ప్రొసీడింగ్స్ ఇవ్వట్లేదు
* పెండింగ్‌లో 5 లక్షల దరఖాస్తులు
* ఎల్ఆర్ఎస్ నుంచి 8000 కోట్ల ఆదాయం?
ఒకవైపు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా హైదరాబాద్‌ని డెవలప్ చేస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ, వాస్తవికంగా చూస్తేనేమో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది.. కనీసం ఎల్ఆర్ఎస్ ఫైళ్లను పరిష్కరించని దుస్థితిలో ఉన్నారు. ఎల్ఆర్ఎస్ ఆరంభించి పదహారు నెలలు అవుతున్నా.. ఆశించినంత స్థాయిలో ఫైళ్లను పరిష్కరించట్లేదు. 20 లక్షల మందికి ఒకేసారి లేఖలు పంపినా.. ఫలితం కనిపించట్లేదు.
తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ - ఎల్ఆర్ఎస్ ఆశించినంతమేర ముందుకు సాగట్లేదు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ కాస్త గందరగోళంగా ఉండటం.. దీనిపై విస్తృతంగా ప్రచారం కల్పించకపోవడం, ఎల్ఆర్ఎస్ చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలు లాంటి కారణాలతో ఈ స్కీమ్ నెమ్మదిగా సాగుతోంది. ఎల్ఆర్ఎస్ పథకానికి గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ అనుకున్న మేర పురోగతి కనిపించలేదు. 25 శాతం రాయితీ ఇస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో కొన్ని సవరణలు చేసి, పెండింగ్ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టినా అంతగా ఫలితం లేదని తెలుస్తోంది. రాయితీని ఎక్కువ మంది సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలని సుమారు 20 లక్షల దరఖాస్తులకు ఒకేసారి లేఖలు పంపింది రేవంత్ సర్కార్.
ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన మొత్తం 25.68 లక్షల దరఖాస్తుల్లో నిషేధిత భూముల పరిధిలో 2.50 లక్షల అప్లికేషన్లు, జలవనరులకు ఆనుకుని ఉన్న వాటికి సంబంధించి 1.60 లక్షల దరఖాస్తులు, ఇతర సాంకేతిక కారణాలతో మరికొన్ని కలిపి సుమారు 5 లక్షలకు పైగా దరఖాస్తులను అధికారులు పెండింగ్ లో పెట్టారు. కానీ దరఖాస్తుదారుల నుంచి ఆశించిన మేర స్పందన రావడం లేదని తెలుస్తోంది. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించినా వెంటనే ప్రొసీడింగ్స్ ఇవ్వడం లేదంటూ దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలా.. లేదంటే వేచి చూడాలా అనే సందిగ్ధంలో దరఖాస్తుదారులు పడిపోయారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారులకు తలెత్తుతున్న సందేహాలను, ఇబ్బందులను పరిష్కరించే ప్రత్యేకమైన వ్యవస్థ లేకపోవడంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ అనుకున్నంతమేర ముందుకు సాగడం లేదని తెలుస్తోంది.
ఎల్ఆర్ఎస్ ద్వారా 8,800 కోట్ల ఆదాయాన్ని రాబట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. 2020లో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 25.68 లక్షల దరఖాస్తుల్లో సుమారు 20 లక్షల మంది ఫీజు చెల్లించినా ఈ మొత్తం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు ముగిసినా సరే.. సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. కొందరు ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి ఆరు నెలలు గడిచినా ప్రొసీడింగ్స్ ఇంకా పూర్తి కాలేదు. దాంతో నెలల నుంచి ప్రొసీడింగ్స్ కోసం ఇంకా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఉన్నతస్థాయిలో హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంతో ఇప్పటికీ ఎల్1 అనుమతుల్లో జాప్యం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఎల్ఆర్ఎస్ ప్రారంభమైనప్పటి నుంచి గడువు ముగిసే వరకు హెచ్ఎండీఏ పరిధిలో సుమారు 1.4 లక్షల మందికి పైగా రుసుము చెల్లించగా.. కేవలం 22 వేల వరకు మాత్రమే ప్రొసీడింగ్స్ జారీ చేశారు. రుసుము చెల్లించిన దరఖాస్తులకు సంబంధించిన వివరాలను తొలుత క్షేత్రస్థాయిలో ఎల్ 1 క్లియరెన్సు కోసం పరిశీలిస్తున్నారు.
* ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో భాగంగా ప్రారంభంలో రెవెన్యూ శాఖ నుంచి రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఇరిగేషన్ నుంచి ఏఈ, తర్వాత హెచ్ఎండీఏ నుంచి జేపీవో లేదా ఏపీవో పరిశీలించి నివేదికను అనుమతులకు పంపిస్తున్నారు. అయితే ఇప్పటికే ఎల్1 తనిఖీలు పూర్తయినా ప్రొసీడింగ్స్ ముందుకు కదలడం లేదు. ఇందుకోసం చాలామంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు హెచ్ఎండీఏ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఫీజు చెల్లించిన వారందరికీ నెల రోజుల్లో ప్రొసీడింగ్స్ జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఎల్ఆర్ఎస్ ప్రత్యేక రాయితీ గడువు మార్చి 31కే ముగిసింది. అయితే అప్పటికి కూడా చాలామంది ఎల్ఆర్ఎస్ చేయించుకోక పోవడంతో ప్రభుత్వం మరో గడువు ఇచ్చింది. ఏప్రిల్ 30 వరకు ఎల్ఆర్ఎస్ గడువు పెంచారు. ఈ డిసెంబర్ నాటికి ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రారంభించి 16 నెలలు కావస్తున్నా రెండు లక్షల లోపే దరఖాస్తులు క్లియర్ కావడం.. ఇంకా 23 లక్షలకు పైగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిశీలనలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0