రూ.42 లక్షల భూమికి రూ.3 కోట్ల జాక్ పాట్
- అభివృద్ధి చేయాలా.. అమ్మేయాలా?
- సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ
భూమి మీద పెట్టే పైసా పెరుగుతుందే తప్ప తగ్గదు అనడానికి ఇది తాజా ఉదాహరణ. పదేళ్ల క్రితం రూ.42 లక్షలు పెట్టి కొన్న భూమి ఇప్పుడు రూ.3 కోట్లు అయింది. దీంతో ఆ భూమిని అమ్మేయాలా.. లేక డెవలప్ మెంట్ చేయాలా అంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఓ యువకుడు ప్రశ్నపై ఆసక్తికర చర్చ జరిగింది.
నాగ్ పూర్ కు చెందిన ఓ కుటుంబం 2015లో వ్యవసాయ భూమిని రూ.42 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. నేల నాణ్యత తక్కువగా ఉందని, పైగా రాళ్లతో నిండి ఉన్నందున సాగు చేయడం కష్టమని అప్పట్లోనే పలువురు పెదవి విరిచారు. చిన్న కచ్చా రోడ్డు మినహా ఎలాంటి యాక్సెస్ కూడా లేకపోవడంతో అది నిరుపయోగంగా ఉండటం మినహా ఏమీ చేయలేరనే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే, ఆ యువకుడి తండ్రి మాత్రం వారితో విభేదించారు. సాగుకు యోగ్యంగా లేకపోయినా.. త్వరలోనే మన గ్రామం అభివృద్ధి చెంది తన భూమి విలువ పెరుగుతుందని ధీమాగా చెప్పారు. ఈ క్రమంలో 2021 నుంచి 2025 మధ్య అంతా మారిపోయింది. అక్కడ సిమెంట్ రోడ్డు వేశారు. ఇతర మౌలిక సదుపాయాలు వచ్చాయి. నాగ్ పూర్ లో మెట్రో కూడా వచ్చింది. సమృద్ధి మహామార్గ్ కారిడార్ విస్తృత ప్రాంతంలో కార్యకలాపాలను వేగవంతం చేసింది. దీంతో 2024 ప్రారంభం నాటికి ఆ భూమికి రూ.90 లక్షలు ఇస్తామంటూ పలువురు ముందుకొచ్చారు. అనంతరం వారి ప్లాట్ నుంచి కేవలం 1.5 కి.మీ దూరంలో మెట్రో స్టేషన్ రానుందనే ప్రకటన వచ్చింది. అంతే బిల్డర్లు సమీపంలోని భూములపై దృష్టిపెట్టారు. దీంతో ఆ భూమికి రూ.కోటిన్నర ఇస్తామని ఆఫర్ ఇచ్చారు.
కొంతకాలం తర్వాత అక్కడ ఓ ఫ్లైఓవర్ ప్రతిపాదించారు. న్యూ నాగ్‌పూర్ కోసం కొత్తగా ప్రచురించిన డెవలప్ మెంట్ మ్యాప్‌లో ఆ భూమికి చోటు దక్కింది. దీంతో దాని రేటు అమాంతం పెరిగిపోయింది. ఆ భూమికి రూ.3 కోట్లు ఇస్తామంటూ ఓ బిల్డర్ ముందుకొచ్చారు. ఈ క్రమంలో తాము ఆ భూమిని విక్రయించాలా లేక డెవలప్ మెంట్ కు ఇవ్వాలా అంటూ ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనిపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భూములకు సంబంధించి లిటిగేషన్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున దానిని అమ్మేయడమే మంచిదని కొందరు పేర్కొన్నారు. చాలామంది మాత్రం దానిని అమ్మడం కంటి డెవలప్ మెంట్ కు ఇవ్వడం వల్ల లాభం ఎక్కువని వాదించారు. అద్దె ఆదాయం కోసం ఒక చిన్న కాంప్లెక్స్ ను నిర్మించమని ఒకరు సూచించగా.. ప్రసిద్ధ బిల్డర్‌తో జాయింట్ వెంచర్ చేసుకోవాలని మరొకరు సిఫార్సు చేశారు, 50-50 ఆదాయ విభజనతో పాటు గుడ్‌విల్ డబ్బును కూడా ప్రతిపాదించారు. అయితే, మరికొందరు రిస్కును తగ్గించి లిక్విడేట్ చేయాలని సలహా ఇచ్చారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న కారిడార్‌లలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, కనెక్టివిటీ అప్‌గ్రేడ్‌లు, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు వేగవంతం అవుతున్న చోట, పేరున్న డెవలపర్‌తో జాయింట్ వెంచర్ అత్యధిక దీర్ఘకాలిక రాబడిని అందిస్తుందని పేర్కొన్నారు.
సాధారణంగా చాలా జాయింట్ వెంచర్ నిర్మాణాలలో డెవలపర్లు పెట్టుబడిపై 28 శాతం నుంచి 35 శాతం మధ్య రాబడిని అందిస్తారని వివరించారు. కొన్ని సందర్భాల్లో గ్రేడ్ ఏ డెవలపర్లు 40 శాతం వరకు రాబడి ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. అయితే, ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు లేదా పూర్తిగా అమ్ముడుపోయే వరకు భూ యజమానులు రెండు నుంచి మూడు సంవత్సరాలు వేచి ఉండటానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0