భాగ్యనగరంలో పెరిగిన ఇళ్ల విక్రయాలు
HYDERABAD FLAT SALES INCREASED
- గతేడాదితో పోలిస్తే 4 శాతం పెరుగుదల
- నైట్ ఫ్రాంక్ నివేదిక విడుదల
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గతేడాది మెరుగ్గానే ఉంది. ఇక్కడ ఇళ్ల విక్రయాలు బాగానే జరిగాయి. 2024తో పోలిస్తే 4 శాతం మేర పెరిగి 38,403 యూనిట్లకు చేరినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. అలాగే ఇళ్ల ధర చదరపు అడుగుకు 13 శాతం పెరిగి రూ.6,271కు చేరినట్టు వివరించింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు ఒక శాతం తగ్గి 3,48,207 యూనిట్లకు పరిమితమైనట్టు పేర్కొంది. అయితే ధరలు మాత్రం చదరపు అడుగుకు 19 శాతం పెరిగినట్టు పేర్కొంది. ధరలు పెరగడం వల్లే డిమాండ్ తగ్గినట్టు విశ్లేషించింది. అయినప్పటికీ గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడం, బలమైన ఆర్థిక వృద్ధితో ఇళ్ల డిమాండ్‌ను స్థిరంగా కొనసాగేలా చేసిందని పేర్కొంది. నగరాల వారీగా చూస్తే.. ముంబై మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు ఒక శాతం పెరిగి 97,188 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్కడ చదరపు అడుగు ధర 7 శాతం పెరిగి రూ.8,856కు చేరింది. బెంగళూరులో ఇళ్ల విక్రయాలు ఎలాంటి మార్పు లేకుండా 55,373 యూనిట్లుగా ఉన్నాయి. ఇళ్ల ధర 12 శాతం పెరిగి రూ.7,388గా ఉంది. పుణెలో ఇళ్ల అమ్మకాలు 3 శాతం తగ్గి 50,881 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇక్కడ ధర 5 శాతం పెరిగి రూ.5,016కు చేరింది. ఢిల్లీ మార్కెట్లో అమ్మకాలు 9 శాతం తగ్గి 52,452 యూనిట్లుగా ఉన్నాయి. ఇళ్ల ధర 19 శాతం ఎగసి రూ.60,28గా ఉంది. అహ్మదాబాద్‌లో విక్రయాలు 2 శాతం పెరిగి 18,752 యూనిట్లుగా నమోదయ్యాయి. ధర 3 శాతం పెరిగి రూ.3,197కు చేరింది. చెన్నైలో ఇళ్ల అమ్మకాలు 12 శాతం పెరిగి 18,262 యూనిట్లకు చేరాయి. ఇళ్ల ధర ఎస్‌ఎఫ్‌టీకి 7 శాతం వృద్ధితో రూ.5,135గా ఉంది. కోల్‌కతాలో అమ్మకాలు 3 శాతం పడిపోయి 16,896 యూనిట్లుగా ఉన్నాయి. ఇళ్ల ధర 6 శాతం పెరిగి ఎస్‌ఎఫ్‌టీకి రూ.4,037గా నమోదైంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0