వచ్చే ఐదేళ్లలో.. దేశంలోనే బెస్ట్ సిటీ
Telangana Rising 2047 Global Summit to transform Future City into India’s best city in five years, boosting Hyderabad real estate, investments and urban development.
* ఫ్యూచర్ సిటీకి ఫుల్ ఫ్యూచర్
* 8న దిగ్గజాల సలహాలు, సూచనలు
* 9న విజన్ డాక్యుమెంట్ విడుదల
* ఆధునిక ప్రపంచానికి గేట్‌వే..
* గ్లోబల్ సమ్మిట్ 2047 తో ఫ్యూచర్ సిటీ ప్రమోషన్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తో హైదరాబాద్ మరో స్థాయికి వెళ్లనుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఫోర్త్ సిటీలో ఈ సమ్మిట్ జరుగుతుండటంతో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి చకచకా అడుగులు పడనున్నాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తో జాతీయ, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు భారీగా రానున్నాయని, తద్వారా ఫ్యూచర్ సిటీ శరవేగంగా దూసుకుపోతుందని ఆశిస్తున్నారు. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కు దీటుగా ఫోర్త్ సిటీ దేశంలోనే బెస్ట్ సిటీగా అభివృద్ధి చెందనుండటంతో ఇక్కడ భారీగా నివాస, వాణిజ్య ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి.
రానున్న 22 ఏళ్ల తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా.. ప్రభుత్వం ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. భారత్ ఫ్యూచర్ సిటీలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. దేశ, విదేశాలకు చెందిన సుమారు 500 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2035 నాటికి తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చెందడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై గ్లోబల్ సమ్మిట్ లో చర్చించి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. 8న స్థానిక, జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో సమావేశాలు, చర్చలు ఉంటాయి. 9న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తారు.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ కేవలం ప్రణాళిక కాదని, ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పమని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలు వేదికలపై స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవం నుంచి మొదలై గ్రామీణ తెలంగాణ వ్యవసాయ వికాసం వరకు ఈ విజన్‌లో స్పష్టంగా ఉండనున్నది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడంలో కీలకమైన పలు ప్రతిపాదిత ప్రాజెక్టుల వెనుక ఉన్న ఆలోచన, ఆవిష్కరణ, ఆచరణ మార్గాలను తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకటిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమయ్యే భారత్ ఫ్యూచర్ సిటీ ఆధునిక ప్రపంచానికి గేట్‌వేగా ఏ విధంగా ఉంటుందో ఈ డాక్యుమెంట్ వెల్లడిస్తుందని రేవంత్ సర్కార్ చెబుతోంది. రీజినల్ రింగ్ రోడ్డు రాష్ట్ర అభివృద్ధికి రాచమార్గంగా ఎలా నిలవనుందో సవివరంగా వివరించనున్నారు. బాపూ ఘాట్ వద్ద నిర్మించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు, గ్రీన్ ఫీల్డ్ హైవేలు, డ్రైపోర్టులు, మెట్రో రైల్ రెండో దశ విస్తరణ ప్రాజెక్టులు, ఔటర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య నిర్మించే రేడియల్ రోడ్ల నిర్మాణంతో తెలంగాణ ముఖచిత్రం ఎలా మారిపోనుందో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ లు, హైదరాబాద్-నాగ్‌పుర్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో భవిష్యత్తులో తెలంగాణను సమూలంగా మార్చే ప్రణాళికల్ని ఈ విజన్ డాక్యుమెంట్ ద్వారా ప్రపంచానికి ప్రభుత్వం తెలియజేస్తుంది.
తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమ్మిట్ ద్వారా హైదరాబాద్ ప్రతిష్ఠ మరోస్థాయికి వెళ్లనుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మరీ ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్ ను భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించడం ద్వారా ఫోర్త్ సిటీని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాలన్న దూరదృష్టి కనిపిస్తోంది. గ్లోబల్ సమ్మిట్ కు దేశ, విదేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజ సంస్థలు, అధిపతులు, ఆర్థికవేత్తలు, పలు రంగాల ప్రముఖులు విచ్చేస్తుండటంతో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నారు. సుమారు 500 జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టనున్నాయని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో భారత్ ఫ్యూచర్ సిటీలో మౌలిక వసతుల ఏర్పాటుకు, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కేంద్ర బిందువు కానుందని అధికారులు చెబుతున్నారు. దీంతో వచ్చే అయిదేళ్లలో దేశంలోనే బెస్ట్ సిటీగా ఫ్యూచర్ సిటీ అభివృద్ది చెందే అవకాశాలు ఉన్నాయని ఆశిస్తున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున రియల్ వెంచర్లు వెలవగా.. వచ్చే ఏడాది కాలంలో పెద్ద ఎత్తున నివాస, వాణిజ్య ప్రాజెక్టులు రానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0