హిల్ట్ పాల‌సీతో కాలుష్య‌ర‌హిత హైద‌రాబాద్

హిల్ట్ పాల‌సీతో కాలుష్య‌ర‌హిత హైద‌రాబాద్

Jan 6, 2026 - 13:04
 0  32
హిల్ట్ పాల‌సీతో కాలుష్య‌ర‌హిత హైద‌రాబాద్

పారిశ్రామిక భూమి బదిలీ విధానం తెలంగాణా ప్రాంతంతో పాటు హైదరాబాద్ నగరంలో స్థిరమైన అభివృద్ధికి దోహద పడుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన విధానంతో కాలుష్య‌ర‌హిత హైద‌రాబాద్ న‌గ‌రంగా రూపాంతరం చెందుతుందని ఆయన చెప్పారు. మంగళవారం రోజున రాష్ట్ర శాసనసభలో ప్రవేశ పెట్టిన పారిశ్రామిక భూమి బదిలీ విధానంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణాతో పాటు హైదరాబాద్ నగరం స్థిరంగా అభివృద్ధి చెందడానికి ఈ విధానం పునాది రాయి వంటిదని అభివర్ణించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక భూమి బదిలీ విధానం పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమని ఆయన కొట్టిపడేశారు. పారిశ్రామిక భూమి బదిలీ విధానంపై బి.ఆర్.ఎస్., బిజెపి లు తమ తమ వైఖరిని స్పష్టం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలను ఔటర్ రింగ్ వెలుపలికి తరలించాల వద్దా అన్నది బి.ఆర్.ఎస్., బి.జె.పి లు తేల్చి చెప్పాలన్నారు.లీజు హక్కులతో ఉన్న భూములకు ఇది వర్తించదని, పూర్తిస్థాయిలో యాజమాన్యా హక్కులు కలిగిన భూములకు మాత్రమే వర్తిస్తుందని ఆయన సుస్పష్టం చేశారు. ఐదు లక్షల కోట్ల విలువైన తొమ్మిది వేల ఏకరాల భూములను దారి మల్లిస్తున్నారన్న  ప్రతిపక్షాల విమర్శలు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. విమర్శ కోసం చేసే విమర్శ మాత్రమేనని ఆయన మండిపడ్డారు.

హైదరాబాద్ మహానగరాన్ని నివాసయోగ్యంగా రూపొందించేందుకు మాత్రమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. దశాబ్దాలుగా పాతుకపోయిన పరిశ్రమలతో ప్రజలకు నివాసయోగ్యత లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అటువంటి దుర్భర పరిస్థితిని సరిదిద్దేందుకే ప్రభుత్వం ఈ విధానాన్ని అమలులోకి తెచ్చిందని ఆయన చెప్పారు. హైదరాబాద్ తో తనకున్న అనుబంధం అవిభాజ్య‌మైనదని, నగరంతో ఆయన కున్న సంబంధాన్ని భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు.

ఒకప్పుడు హైదరాబాద్ లో తనకు వ్యవసాయ భూములు కుడా ఉన్నాయన్నారు. మియపూర్ వంటి ప్రాంతాలలో పరిశ్రమలు విరజిమ్ముతున్న కాలుష్యంతో బోరు బావుల నుండి రంగు మారిన నీరు వస్తుందని ఆయన పేర్కొంటూనే కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమల తరలింపు ఎంత అవసరమో అన్నది ఆయన సభకు వివరించారు. నూటికి నూరు శాతం రిజిస్ట్రేషన్ విలువ చెల్లించాలని నిబంధన పెడితే పరిశ్రమలు ఎందుకు పోతాయన్న కోణంలో వారికి తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి తరలించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

భూముల ధరల విషయంలోను ప్రభుత్వం అత్యుత్త‌మ‌ విధానాన్ని అనుసరిస్తుందని 80 అడుగుల వెడల్పు రహదారి సౌకర్యం కలిగిన భూములకు రిజిస్ట్రేషన్ విలువలో 50 శాతం, 80 అడుగుల కంటే తక్కువ ఉన్న వాటికి 30 శాతంగా నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. పరిశ్రమల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ల మధ్య సమతుల్యత పాటించేందుకే పారిశ్రామిక భూమి బదిలీ విధానం లక్ష్యమని, ప్రజల ప్రయోజ‌నార్థం దీనిని రూపొందించామని, ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలులోకి తెస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభకు తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0