2025 హైద‌రాబాద్ రియాల్టీలో లగ్జరీ ఇళ్ల అమ్మకాలదే పైచేయి

Luxury and premium homes drove Hyderabad real estate in 2025, with ₹1.5–4 crore homes seeing strong demand as buyers shifted to high-value properties.

Dec 26, 2025 - 01:56
 0  101
2025 హైద‌రాబాద్ రియాల్టీలో లగ్జరీ ఇళ్ల అమ్మకాలదే పైచేయి
hyderabad-real-estate-2025-luxury-home-sales

గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ క్రమంగా కోలుకుంటోంది. గత రెండేళ్లుగా కొంతమేర స్త‌బ్దుగా ఉన్న నిర్మాణ రంగం.. 2025 ఏడాదిలో కాస్త నిలదొక్కుకుంది.  క్రమంగా మందగమనం నుంచి కోలుకుని కాస్త‌ స్పీడ్ అందుకుంటోంది. భాగ్యనగరంలో ఇంటి కొనుగోలుదారులు వేచి చూసే ధోరణి నుంచి ఇప్పుడిప్పుడే నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది 2025లో పరవాలేదనిపించిన నిర్మాణ రంగం.. ప్రీమియం, లగ్జరీ అమ్మకాలపైనే ఆధారపడింది. కోటి రూపాయల నుంచి నాలుగు కోట్ల సెగ్మెంట్ లోని ఇళ్ల అమ్మకాల ద్వార గ్రేటర్ సిటీ రియాల్టీ కొంతమేర నిలదొక్కుకుందని ప‌లు స‌ర్వేలు చెబుతున్నాయి.


2025లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా పుంజుకుంది. ఏడాది ప్రారంభం జనవరి, ఫిబ్రవరిలో ఇళ్ల అమ్మకాలు ఆశాజనకంగా లేకపోయినా.. మెల్ల మెల్లగా మార్చి నుంచి అమ్మకాల్లో వేగం పెరిగింది.  మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో 2025 సంవత్సరంలో ప్రీమియం హౌసింగ్ కు క్రేజీ పెరిగింది. కోటిన్నర రూపాయలు ఆ పైన ఉన్న ధరల ఇళ్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో 75 లక్షల లోపు ఉన్న ఇళ్లకు అంతగా డిమాండ్ లేదని పలు సర్వే నివేదికలు చెబుతున్నాయి.  

కొత్త యూనిట్లు..
2025లో సుమారు 8,630 యూనిట్లు కొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. గత ఏడాది 2024లో 13,890 యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. 2024తో సరిపోల్చితే 38 శాతం తగ్గుదల ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక 2025 నవంబర్ నాటికి సుమారు 11,035 యూనిట్లు అమ్ముడ‌య్యాయి. 2024లో ఉన్న 12,735 యూనిట్లతో పోల్చితే 11 శాతం తగ్గుదల నమోదైంది. హైదరాబాద్‌లో ప్రీమియం హౌసింగ్ అంటే కోటిన్నర రూపాయల కంటే.. అధిక ధరల శ్రేణిలోని ఇళ్లు.. 2025లో 8,205 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాదితో పోల్చితే.. భారీగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.  కోటి రూపాయలపైన విలువ చేసే ప్రీమియం హోమ్స్‌ అమ్మకాల్లో 28 శాతం వాటా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తంగా ప్రీమియం హౌసింగ్ పై హైదరాబాదీలు మక్కువ పెంచుకుంటున్నారని చెప్పుకోవచ్చు.

* హైదరాబాద్ లో 2025లో కోటి రూపాయలు ఆపైన ఇళ్లకు సంబంధించి 37 శాతం రిజిస్ట్రేషన్లు పెరిగాయి. ఈ ఏడాది కాలంలో 10 వేల 661 యూనిట్లు అందుబాటులోకి రాగా.. 2024తో పోల్చితే 4 శాతం తగ్గుదల ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఇళ్ల ధరల పెరుగుదల 9 శాతంగా నమోదైంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అనరాక్ రిపోర్ట్ ప్రకారం.. 2025 సెప్టెంబర్ నాటికి హైదరాబాద్‌లో సుమారు 98,000 యూనిట్లు అమ్మకం కాకుండా ఉన్నాయి. 2025లో ఆఫీస్ స్పేస్ లావాదేవీలు పెరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 31 శాతం పెరుగుదల నమోదైంది. ఇక ఆఫీస్ అద్దె ధరలు సగటున 9 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ప్రీమియమ్ ఇళ్ల‌‌కు భారీగా డిమాండ్ పెరిగింది.

ఈ ఏడాది హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌ ను నడిపించింది లగ్జరీ మరియు ప్రీమియం గృహాలు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. 1.5 కోట్ల నుండి 4 కోట్ల రూపాయల పైబడిన ఇళ్లకు డిమాండ్ పెరిగింది. సంపన్న వర్గాలు, ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం వల్ల ఈ సెగ్మెంట్ 28 శాతం వృద్ధిని సాధించింది. మరోవైపు, నిర్మాణ ఖర్చులు పెరగడం వల్ల సామాన్యులకు అందుబాటులో ఉండే అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ మాత్రం ఒడిదుడుకులకు గురైంది. హైదరాబాద్ నగరంలో ఇళ్ల ధరలు సగటున చదరపు అడుగుకు రూ. 6,164 రూపాయలు ఉందని నైట్ ఫ్రాంక్ పేర్కొంది.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 2025లో కొత్త ప్రాజెక్టుల లాంచింగ్‌లు, విక్రయాలు ప్రారంభంలో 25 శాతం తగ్గినట్లు కనిపించినా, ఏడాది చివరకి వచ్చేసరికి మార్కెట్ మళ్లీ పుంజుకుంది. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్ గచ్చిబౌలి, కోకాపేట్ లో ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ. 9,100 నుండి రూ.13,000 వరకు పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు సగటున 6 నుండి 16 శాతం వరకు పెరిగాయి. మొత్తంగా 2025 రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిమాణం కంటే నాణ్యత కి ప్రాధాన్యతనిచ్చింది. అందుబాటు ధరల ఇళ్లలో మందగమనం ఉన్నప్పటికీ, ప్రీమియం, ఆఫీస్ స్పేస్ లీజింగ్ రంగాలు దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని ఇచ్చాయి. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0