జీహెచ్ఎంసీలో 306 డివిజన్లు?

GHMC redivision may increase wards to 306 as limits expand up to ORR. Structural changes are expected to influence Hyderabad real estate and civic planning.

Dec 6, 2025 - 21:55
 0  7
జీహెచ్ఎంసీలో 306 డివిజన్లు?
306-divisons-in-hyderabad

ఔటర్ రింగ్ రోడ్డు వరకు గ్రేటర్ గా మారిన జీహెచ్ఎంసీ పూర్తిగా తన స్వరూపాన్ని మార్చుకోనుంది. కౌన్సిల్ పరిధిలో ప్రస్తుతం ఉన్న వార్డుల సంఖ్య డబుల్ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏడు కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కౌన్సిల్ మినిట్స్ బుక్స్.. అకౌంట్స్ ఇతర ముఖ్యమైన పత్రాలను పూర్తి స్థాయిలో జీహెచ్ఎంసీ అధికారులు సాధీనంలోకి తీసుకున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగుతే రెండు మూడు రోజుల్లో గ్రేటర్ పరిధిలోని వార్డుల విభజన నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది.

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పేరుతో ఔటర్ రింగ్ రోడ్డు వరకు డెవలప్ చేయాలని డిసైడ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతం అంతా జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొచ్చింది. ఓఆర్ఆర్ పరిధిలో ఉండే 51 గ్రామ పంచాయతీలను గతంలోనే ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో విలీనం చేసింది. ఇప్పుడు ఏడు కార్పొరేషన్లు 20 మున్సిపాలిటీల‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ డిసైడ్ చేసింది. దాంతో ఆ ప్రాంతం పాలన పగ్గాలను జీహెచ్ఎంసీ తీసుకుంది. ప్రభుత్వం ఇటీవ‌ల‌ జీవో విడుదల చేయడంతో ఆయా ప్రాంతాల్లోని కార్యాలయాలను జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో కౌన్సిల్ మరియు కార్పొరేషన్ మినిట్స్ బుక్స్... బ్యాంకు ఖాతా వివరాలు అందుకు సంబంధించిన చెక్ బుక్స్... స్వాధీనం చేసుకొని ఆ ఖాతాలను క్లోజ్ చేశారు. ఇకపై జరిగే ప్రతి ఆర్థిక లావాదేవీ జీహెచ్ఎంసీ కమిషనర్ పేరు మీద జరిగేలా ఆదేశాల్ని జారీ చేశారు తన ఆధీనంలోకి వచ్చిన జీహెచ్ఎంసీనీ పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించేందుకు బల్దియ అధికారులు సిద్ధమవుతున్నారు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 150 కార్పొరేటర్ వార్డులు.. 30 సర్కిళ్లు ఆరు జోన్లు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2170కి చదరపు కిలోమీటర్ల మేర విస్తరించడంతో వార్డుల పునర్విభజన పై అధికారులు ఫోకస్ పెట్టారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వార్డులను 300 నుంచి 306 వరకు పెంచేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో కోటీ 30 లక్షల మంది వరకు జ‌నాభా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2011 లెక్కలతో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని వార్డుల విభజన చేసే అవకాశం ఉంది. ప్రతి వార్డుకు 40 నుండి 45 వేల మంది ప్ర‌జ‌లుండేలా వార్డుల విభజన ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో 10 శాతం ఎక్కువ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. నియోజకవర్గాలను ప్రాతిపాదికగా తీసుకొని సహజ సరిహద్దులైన రోడ్లు.. నాలాలు.. రైల్వే ట్రాక్లు.. బ్రిడ్జిలను హద్దులుగా పరిగణించే అవకాశం ఉంది. అలా గ్రేటర్ పరిధిలో మొత్తంగా 300కు పైగా వార్డులు ఏర్పాటు కానున్నాయి.

ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ వార్డుల సరిహద్దులు కూడా మారనున్నాయి. 2016లో వార్డుల పునర్విభజన మరియు రిజర్వేషన్ల మార్పు చేశారు. 2020 కార్పోరేషన్ ఎలక్షన్ సమయంలో కేవలం మేయర్ డిప్యూటీ మేయర్ల రిజర్వేషన్లు మాత్రం మార్పు చేశారు. ఇప్పుడు మరోసారి వార్డుల పునర్విభజన పనులను జీహెచ్ఎంసీ చేప‌ట్టింది. ఈ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో పాటు ఆయా
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన సిబ్బంది పూర్తిగా ఇదే పనుల్లో నిమగ్నమయ్యారు. అన్ని అనుకున్నట్లు జరిగితే కొద్ది రోజుల్లోనే వార్డుల పునర్విభజన నోటిఫికేషన్ జారీ కానుంది.

ఒకసారి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో ఉండే పౌరులు, పౌర సంఘాలు, కాలనీ సంక్షేమ సంఘాలు, రాజకీయ పార్టీలు, వ్యక్తుల నుండి అభిప్రాయాలు సేకరించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ అంశంపై చర్చించేందుకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రత్యేకంగా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. అన్ని వర్గాల అభిప్రాయ సేకరణ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వార్డుల హద్దులను ఫిక్స్ చేయనుంది. వీటితోపాటు సర్కిళ్ల‌ సంఖ్యను 30 నుండి 60కి పెంచే అవకాశం ఉన్నట్లు బల్దియా వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం ఆరు జోన్లు ఉండగా వాటి సంఖ్య పది నుంచి 12కు పెరిగే పరిస్థితులు ఉన్నాయి. అయితే వీటన్నింటిని ఎంఎల్ఏ నియోజకవర్గాలను ప్రాతిపాదికగా తీసుకొని చేసే అవకాశం ఉన్నట్లు బల్దియా వర్గాలు చెబుతున్నాయి.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0