అక్క‌డ అనుమ‌తులు ఎవ‌రిస్తారు?

Confusion over GHMC and HMDA construction approvals after GHMC expansion. Builders and buyers seek clarity in Hyderabad real estate permissions.

Dec 19, 2025 - 06:30
 0  10
అక్క‌డ అనుమ‌తులు ఎవ‌రిస్తారు?
ghmc-hmda-construction-permissions-confusion-hyderabad-real-estate

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిర్మాణాలకు సంబంధించిన‌ అనుమతులపై సందిగ్దం నెలకొంది. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల విలీనం తరువాత పర్మీషన్లపై గందరగోళం ఏర్పడింది. కొత్తగా విలీనం అయిన ప్రాంతాల్లో ఇప్పటి వరకు హెచ్ఎండీఏ నిర్మాణ అనుమతులు ఇస్తూ వస్తుండగా.. ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధి పెరగడంతో ఇకపై నిర్మాణ అనుమతులు ఎవరిస్తారనే దానిపై క్లారిటీ లేకపోవడంతో ఆందోళన నెలకొంది.

జీహెచ్ఎంపీ పరిధి ఔటర్‌ రింగ్ రోడ్డు అవతలి వరకు విస్తరించగా.. ఆయా ప్రాంతాల్లో లేఅవుట్లు, బహుళ అంతస్తుల నిర్మాణ అనుమతుల అధికారంపై సందిగ్ధం నెలకొంది. విస్తరిత ప్రాంతాల్లో అనుమతులు ఇచ్చే అధికారం ప్రస్తుతం జీహెచ్‌ఎంసీకి పరిమితంగానే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధి పెరగడం వరకు బాగానే ఉన్నా ఇప్పుడు శివారు ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతుల విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది. జీహెచ్‌ఎంసీని ఔటర్‌ రింగ్ రోడ్డు అవతలి వరకు విస్తరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేయగానే ఆ మేరకు బిల్డ్ నౌలో మార్పులు చేశారు. కేవలం వెయ్యి చదరపు మీటర్లలోపు ఏడు అంతస్తుల వరకు భవన నిర్మాణ అనుమతులు జారీ చేసే విధంగా బిల్డ్‌నౌలో సాంకేతిక మార్పులు తీసుకొచ్చారు.

జీహెచ్‌ఎంసీతో పాటు శివారు ప్రాంతాలన్నీ హెచ్‌ఎండీఏ పరిధిలోనివి కావడంతో అధికారాల బదలాయింపుపై ఎగ్జిక్యూటివ్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. హెచ్‌ఎండీఏ పరిధి జీహెచ్‌ఎంసీతో పాటు మొత్తం 11 జిల్లాలతో 10,472 చదరపు కిలోమీటర్ల వరకు ఉంది. 2013 నాటి మాస్టర్‌ ప్లాన్‌-2030 ప్రకారంగా హెచ్‌ఎండీఏ ప్రస్తుతం మెరుగైన పట్టణ ప్రణాళిక చర్యల్ని చేపడుతోంది. ఈ పరిధిలో భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతులు హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జారీ చేస్తూ వస్తున్నాయి. హెచ్‌ఎండీఏ 2008లో ఏర్పడిన సందర్భంలోనే జీహెచ్‌ఎంసీ కూడా ఏర్పడగా.. ఆ సమయంలోనే భవన నిర్మాణ, లేఅవుట్‌, గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీల అనుమతులు జారీ చేసే అధికారాలను హెచ్‌ఎండీఏ బదలాయించింది. ఇక శివారు ప్రాంతాల్లో ఇందుకు సంబంధించిన‌ అనుమతులు హెచ్‌ఎండీఏ జారీ చేస్తోంది. తాజాగా ఆ ప్రాంతాలన్నీ జీహెచ్‌ఎంసీలో విలీనమయ్యాయి.

లేఅవుట్‌, గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీ అనుమతులు, బహుళ అంతస్తుల భవనాల అనుమతులను హెచ్‌ఎండీఏనే జారీ చేస్తోంది. విలీన ప్రాంతాల్లో కొత్తగా ఎవరైనా బహుళ అంతస్తులు, లేఅవుట్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే హెచ్‌ఎండీఏకు చేరుతున్నాయి. వెయ్యి చదరపు మీటర్లలోపు ఏడు అంతస్తుల వరకు మాత్రం జీహెచ్‌ఎంసీకి వెళ్తున్నాయి. పాత జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం ఎన్ని బహుళ అంతస్తుల నిర్మాణాలకైనా, లేఅవుట్‌, గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలకైనా అనుమతులు ఇస్తున్నారు. విస్తరిత ప్రాంతాల్లో కూడా అన్నీ రకాల అనుమతులిచ్చే అధికారాలను జీహెచ్‌ఎంసీకి బదలాయించాలంటే హెచ్‌ఎండీఏ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. కాబట్టి, జీహెచ్ఎంసీ విలీన ప్రక్రియ మొత్తం ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు దీనిపై నిర్ణయం తీసుకుంటారన్న సందిగ్దం నెలకొంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0