ఇళ్ల అమ్మకాలు, సరఫరా రెండూ తగ్గాయ్
India housing sales fell 16% and new supply dropped 10% in Q4 2025 across 9 cities, says PropEquity. Hyderabad, Pune, Mumbai saw major declines.
- విక్రయాలు 19 శాతం, కొత్త సరఫరా 10 శాతం తగ్గుదల
- 2025 నాలుగో త్రైమాసికంలో ఇదీ పరిస్థితి
- ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడి
దేశంలో 2025 నాలుగో త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు, కొత్త సరఫరా రెండూ తగ్గాయి. దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 98,019 యూనిట్లకు పరిమితం అవుతాయని రియల్ ఎస్టేట్ డేటా అనలైటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. 2024 చివరి త్రైమాసికంలో విక్రయాలు 1,16,137 యూనిట్లతో పోల్చితే ఇది 16 శాతం తక్కువ అని తెలిపింది. ఈ మేరకు తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది.
హైదరాబాద్ సహా ఏడు నగరాల్లో అమ్మకాలు తగ్గగా.. నవీ ముంబై, ఢిల్లీల్లో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందని తెలిపింది. 2025 నాలుగో త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన నవీ ముంబై లో 13 శాతం, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 4% వృద్ధి నమోదు కాగా.. మిగిలిన ఏడు నగరాల్లో అమ్మకాలు 31% వరకు పడిపోయాయి. 2021 మూడవ త్రైమాసికం తర్వాత నమోదైన అత్యల్ప త్రైమాసిక అమ్మకాలు ఇవే కావడం గమనార్హం. "సాంప్రదాయకంగా అక్టోబర్-డిసెంబర్ కాలంలో పండుగ సీజన్ కారణంగా అమ్మకాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు జోరుగా ఉంటాయి. అయితే, ఇటీవలి క్షీణత మార్కెట్‌లో ప్రీమియం ఉత్పత్తుల వైపు మారుతున్న ధోరణిని ప్రతిబింబిస్తుంది. అమ్మకాల పరిమాణం తగ్గినా విలువలో వృద్ధి చెందడమే దీనికి నిదర్శనం. ఈ ధోరణి 2024 నుంచి కొనసాగుతోంది," అని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈఓ సమీర్ జసూజా అన్నారు.
* నగరాల వారీగా పరిస్థితి చూస్తే.. హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు డిసెంబర్ త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 19 శాతం తగ్గి 11,323 యూనిట్లుగా ఉండొచ్చని నివేదిక అంచనా వేసింది. చెన్నైలోనూ 3 శాతం తక్కువగా 4,542 యూనిట్లకు విక్రయాలు పరిమితం కావొచ్చని తెలిపింది. బెంగళూరులో అమ్మకాలు 15,603 యూనిట్లుగా ఉంటాయని, క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఒక శాతం తక్కువని వివరించింది. కోల్‌కతాలో 11 శాతం తక్కువగా 3,995 యూనిట్లుగా ఉంటాయని తెలిపింది. పుణెలో అమ్మకాలు ఏకంగా 31 శాతం తగ్గి 15,788 యూనిట్లకు పరిమితం అవుతాయని.. థానేలో అమ్మకాలు 26 శాతం తగ్గి 16,987 యూనిట్లుగా ఉంటాయని అంచనా వేసింది. ముంబై మార్కెట్లోనూ 25 శాతం తక్కువగా 9,135 యూనిట్లకు విక్రయాలు పరిమితం అవుతాయని వెల్లడించింది. నవీ ముంబైలో మాత్రం 13 శాతం అధికంగా 8,434 యూనిట్లు అమ్ముడుపోవచ్చని.. ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లోనూ అమ్మకాలు 4 శాతం వృద్ధితో 12,212 యూనిట్లుగా ఉంటాయని తెలిపింది.
* కొత్త సరఫరా విషయానికి వస్తే.. 2023లో సుమారు 4.81 లక్షల యూనిట్లు మొత్తం రూ.6.3 లక్షల కోట్ల విలువతో ప్రారంభం కాగా, 2024లో 4.11 లక్షల యూనిట్లు మాత్రమే ప్రారంభమయ్యాయి. అంటే దాదాపు 70,000 యూనిట్లు తక్కువ. కానీ వాటి మొత్తం విలువ రూ.6.8 లక్షల కోట్లుగా ఉంది. 2025 నాలుగో త్రైమాసికంలో గృహాల సరఫరా వార్షిక ప్రాతిపదికన 10% తగ్గి 88,427 యూనిట్లకు చేరింది. ఢిల్లీ (29%), నవీ ముంబై (15%), చెన్నై (9%) మాత్రమే వృద్ధిని నమోదు చేశాయి. మిగిలిన ఆరు నగరాల్లో సరఫరా 30% వరకు తగ్గింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0