మ‌హాసిటీ.. మ‌ణికొండ

Manikonda becomes Hyderabad’s hottest real estate hub after Jubilee Hills. Property prices, villas, apartments and connectivity drive massive demand.

Dec 19, 2025 - 06:32
 0  15
మ‌హాసిటీ.. మ‌ణికొండ
manikonda-emerges-as-premium-hyderabad-real-estate-hub

హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తరువాత అంతటి డిమాండ్ ఉన్న ప్రాంతం మణికొండ అని చెప్పడం ఏ మాత్రం అతియోశక్తి కాదు. కేవలం 25 ఏళ్లలో మణికొండ కనీవినీ ఎరుగని రీతిలో మారిపోయింది. ఇంకా చెప్పాలంటే గత పదేళ్లలో మణికొండ రూపురేఖలు గుర్తు పట్టలేనంతగా మారాయి. మణికొండలో రియల్ ఎస్టేట్ ప్రారంభమైనప్పుడు వెయ్యి రూపాయలు కూడా పలకని చదరపు గజం ఇప్పుడు లక్షన్నర పైమాటే. ఇక అపార్ట్ మెంట్స్, విల్లాల సంగతి చెప్పక్కర్లేదు. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

హైదరాబాద్ మహా నగరంలో ఇప్పుడు ప్రధానమైన ప్రాంతాల్లో మణికొండ ఒకటి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ తరువాత అంతటి ప్రముఖమైన నివాస ప్రాంతాల జాబితాలో మణికొండ ఉంటుంది. అయితే 25 ఏళ్ల క్రితం మణికొండకు, ఇప్పటి మణికొండకు పోల్చుకుంటే వెయ్యి రెట్లు మారిపోయింది. ఒకప్పుడు గ్రామంగా ఉన్న మణికొండ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కీల‌క‌ ప్రాంతంగా మారింది. గ్రేటర్ సిటీ రియల్ ఎస్టేట్ రంగంలో మణికొండ హాట్ కేక్ అని చెబుతున్నారు మార్కెట్ రంగ వర్గాలు. అవును హైదరాబాద్ లోని ప్రీమియం ప్రాంతాలతో పోటీపడుతోంది మణికొండ. మరీ ముఖ్యంగా మణికొండ ప్రముఖులకు నివాస ప్రాంతంగా మారిపోయింది. ఒకప్పుడు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో నివసించిన సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు ఇప్పుడు మణికొండకు నివాసం మార్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సినీ, టీవీ రంగ ప్ర‌ముఖులు.. మణికొండలో గృహాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

మణికొండకు మంచి కనెక్టివిటీ ఉండటం అనుకూలమని చెప్పవచ్చు. జూబ్లీహిల్స్ నుంచి మణికొండకు కేవలం 7 కిలోమీటర్లే.అదే ఫిల్మ్ నగర్ నుంచి మణికొండ 5 కిలో మీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇక ఐటీ కారిడార్ గచ్చిబౌలి నుంచి మణికొండకు కేవలం పది నిమిషాల్లో చేరుకోవచ్చు. అటు మెహిదీపట్నం నుంచి మణికొండకు 15 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంజినీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ హాస్పిటల్స్, భారీ షాపింగ్ మాల్స్, మల్టీఫ్లెక్స్ థియేటర్స్, స్పోర్స్ట్ అకాడమీలు.. ఇలా కావాల్సినవన్నీ మణికొండకు అత్యంత చేరువ‌లో ఉన్నాయి. సికింద్రాబాద్, మెహిదీపట్నం నుంచి ప్రతి 15 నిమిషాలకో ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. అంతేకాదు రాయదుర్గం మెట్రో స్టేషన్ కు కేవలం 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుకు మణికొండ 6 కిలోమీటర్ల దూరంలో ఉండటం విశేషం.

మణికొండలో సరిగ్గా 25 ఏళ్ల క్రితం 1998 లో చదరపు గజం కేవలం 750 రూపాయలు మాత్రమే. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ముప్పాస్.. మణికొండలో పంచవటి కాలనీ పేరుతో రియల్ ఎస్టేట్ వెంచర్ ను డెవలప్ చేసింది. అప్పుడు చదరపు గజం కేవలం 750 రూపాయలే. ఆ తరువాత క్ర‌మ‌క్రమంగా మణికొండలో రియల్టీ ప్రాజెక్టులు మొదలయ్యాయి. మెల్లమెల్లగా అపార్టుమెంట్ ల నిర్మాణం, ఇండిపెండెంట్ ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. మణికొండలో ల్యాంకో హిల్స్ నిర్మాణంతో ఈ ప్రాంతం ఒక్కసారిగా హాట్ లొకేష‌న్‌గా మారింది. అది మొదలు భారీగా అపార్ట్ మెంట్ నిర్మాణాలు మెదలవ్వగా.. విల్లాల నిర్మాణం సైతం ప్రారంభమైంది. ఇప్పుడు మణికొండలో హైరైజ్ అపార్ట్ మెంట్స్ నిర్మాణం జరుపుకుంటున్నాయి. 25 ఏళ్ల క్రితం చదరపు గజం 750 రూపాయలున్న ధర.. ఇప్పుడు మెయిన్ రోడ్డుకైతే చదరపు గజం 2 లక్షలు, కాస్త లోపలికెళితే చదరపు గజం 1.5 లక్షల మేర ధరలు పలుకుతున్నాయి. ఇక పదేళ్ల క్రితం అపార్ట్ మెంట్ లో చదరపు అడుగు 2,500 ఉండగా.. ఇప్పుడు చదరపు అడుగు ప్రాజెక్టును బట్టి 7 వేల నుంచి 12 వేల రూపాయల వరకు ధరలున్నాయి.

ఇక మణికొండలో విల్లాలకు భారీ డిమాండ్ ఉంది. అందుకు అనుగునంగా మణికొండలో పలు రియల్ ఎస్టేట్ సంస్థలు భారీగా విల్లాల నిర్మాణం చేపడుతున్నాయి. ప్రాంతం, ప్రాజెక్టు, విస్తీర్ణం, సౌకర్యాలను బట్టి ఒక్కో విల్లా 7 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల వరకు ధరలున్నాయి. మరోవైపు మణికొండలో ఇంటి స్థలాలు సైతం అందుబాటులో ఉండటంతో వాటికి మంచి డిమాండ్ ఉంది. భారీ అపార్ట్ మెంట్స్ ప్రాజెక్టులతో పాటు స్టాండ్ లోన్ అపార్ట్ మెంట్ నిర్మాణాలు కూడా అధికంగా ఉండటంతో మధ్య తరగతి వారు సైతం మణికొండలో సొంత నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడ మెయిన్ రోడ్డు నుంచి కాస్త లోపలికి వెళితే.. రూ. 80 లక్షల నుంచి కోటి రూపాయలకు కూడా అపార్ట్ మెంట్ లో ఫ్లాట్స్ లభిస్తున్నాయి. దీంతో మిడిల్ క్లాస్ వాళ్లు తమ సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0