హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి HMDA మెగా ప్రాజెక్టులు
హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి HMDA మెగా ప్రాజెక్టులు
హైదరాబాద్‌లో పట్టణ రవాణా సౌలభ్యాన్ని మెరుగుపరచడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం మరియు నగర దీర్ఘకాలిక అభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా పలు కీలక మౌలిక వసతుల అభివృద్ధి పనులను ప్రారంభించింది. ప్రాంతీయ మరియు అంతర్గత నగర కనెక్టివిటీని గణనీయంగా బలోపేతం చేసే కొన్ని ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి.
రేడియల్ రోడ్–2ను అవుటర్ రింగ్ రోడ్డుతో 143 కిలోమీటర్ వద్ద కలిపే కొత్త ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మాణానికి, బుద్వేల్ లేఅవుటుతో అనుసంధానం చేస్తారు. ప్రస్తుత రాజేంద్రనగర్ ఇంటర్చేంజ్ అభివృద్ధితో కలిపి ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ఇటీవల జీవో జారీ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పూర్తయ్యింది. ప్రస్తుతం టెండర్ దశలో ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపకల్పన చేసిన ఈ ఇంటర్చేంజ్ హైదరాబాద్‌కు ఒక ల్యాండ్ మార్క్ గేట్‌వే గా మారుతుందని అంచనా. ఇది బుద్వేల్ లేఅవుట్‌తో పాటు రానున్న మూసీ నది రివర్‌ఫ్రంట్ మౌలిక వసతులకు కనెక్టవిటీని అందిస్తుంది. ఈ ఇంటర్చేంజ్ ద్వారా రేడియల్ రోడ్–2, ORR–గచ్చిబౌలి, ORR–శంషాబాద్–రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు బుద్వేల్ మధ్య ట్రాఫిక్ సాఫీగా ప్రవహించడంతో పాటు ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రాంతీయ రవాణా సౌలభ్యం మెరుగుపడుతుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.488 కోట్లు కాగా, హెచ్ఎండీఏ అంతర్గత నిధులు ద్వారా నిధులు సమకూర్చబడతాయి.
ఎలివేటెడ్ కారిడార్–III : ICCC నుండి శిల్పా లేఅవుట్ వరకు
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పట్టణ కనెక్టివిటీ మరియు ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరచేందుకు రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇందులో మొదటిది ప్యారడైస్ జంక్షన్ నుండి షామీర్ పేట్, ప్యారడైస్ జంక్షన్ నుండి డెయిరీ ఫామ్ రోడ్ వరకు రెండోది. వీటితో పాటు అదనంగా బంజారాహిల్స్‌లోని ICCC నుండి శిల్పా లేఅవుట్ వరకు ఎలివేటెడ్ కారిడార్–III ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది గచ్చిబౌలి వద్ద ఓఆర్ఆర్ కు నేరుగా, సిగ్నల్ లేని కనెక్టివిటీని అందిస్తుంది. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.1,656 కోట్లు. అయితే, ఈ ప్రాజెక్టు రెండు దశల్లో అమలవుతుంది. మొదటి దశ.. ఫిల్మ్‌నగర్ నుండి శిల్పా లేఅవుట్ వరకు – 5.00 కి.మీ కాగా.. రెండో దశ, ఐసీసీసీ టవర్ నుండి హకీంపేట్ కుంట వరకు నాలుగు కిలోమీటర్ల మేరకు డెవలప్ చేస్తారు.
* ఈ ఎలివేటెడ్ కారిడార్ బంజారాహిల్స్, ఫిలిం నగర్, నార్నె రోడ్, ITC కోహెనూర్ రోడ్, టీ–హబ్, శిల్పా లేఅవుట్ వంటి కీలక ప్రాంతాలను అనుసంధానిస్తూ రైడర్గ్–హైటెక్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది మెహదీపట్నం–గచ్చిబౌలి మధ్య ఉన్న ప్రస్తుత రేడియల్ రోడ్డుకు ప్రత్యామ్నాయ సమాంతర మార్గంగా అభివృద్ధి చేస్తారు. దీని వల్ల ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుంది. ఈ ప్రాజెక్టులో 4 లేన్ మరియు 6 లేన్ ఏర్పాట్ల కలయికతో, భూమి స్థాయిలో మరియు ఎలివేటెడ్ భాగాలు ఉంటాయి. రోడ్ నం.82 (ఫిల్మ్‌నగర్), నార్నె రోడ్, రోడ్ నం.52, ITC కోహెనూర్ రోడ్, టీ–హబ్ జంక్షన్, ఔరో రియాల్టీ జంక్షన్ల వద్ద మొత్తం ఆరు ప్రవేశ–నిష్క్రమణ పాయింట్లను ప్రతిపాదించారు. ఈ మార్గంలో సుమారు 1.00 కి.మీ (చైనేజ్ 700 నుండి 1700 వరకు) హైదరాబాద్ జిల్లాలో రక్షణ శాఖకు చెందిన భూమి మీదుగా వెళ్తున్నట్లు గుర్తించబడింది. అందుకు అవసరమైన పనుల అనుమతి మరియు క్లియరెన్సుల కోసం దరఖాస్తు చేయబడింది. ఈ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును కూడా HMDA అంతర్గత నిధులు (ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు) ద్వారా చేపడతారు.
ఎంసీజీఐటీ వద్ద శంకర్పల్లి రోడ్ నుండి మణికొండ వరకూ..
కోకాపేట్, మణికొండ, గండిపేట, పుప్పాల్‌గూడ, నార్సింగి తదితర పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించాలన్న ఆలోచనలతో.. హెచ్‌జీసీఎల్ సంస్థ శంకర్పల్లి రోడ్‌లోని ఎంజీఐటీ వద్ద నుండి మణికొండ వరకు 3.57 కి.మీ పొడవున పైప్‌లైన్ రోడ్ అభివృద్ధి పనులను చేపడుతుంది. ఈ పనులకు రూ.110.00 కోట్లతో ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు చేసింది ప్రతిపాదిత అభివృద్ధిలో 10 మీటర్ల మిడియన్తో 6 లేన్ రహదారి నిర్మాణం, రహదారి రెండు వైపులా డ్రెయిన్–కమ్–ఫుట్‌పాత్, కల్వర్టులు, చిన్న వంతెనలు, జంక్షన్ అభివృద్ధి మరియు ల్యాండ్‌స్కేపింగ్ పనులు ఉంటాయి. త్వరలో ఈ–ప్రొక్యూర్మెంట్ ప్లాట్‌ఫారమ్‌లో టెండర్లు ఆహ్వానిస్తారు.
నానక్‌రాంగూడ నుంచి గచ్చిబౌలి వరకూ..
నానక్‌రాంగూడ నుంచి గచ్చిబౌలి వరకు అవుటర్ రింగ్ రోడ్ ప్రధాన రహదారి (సర్వీస్ రోడ్లు లేకుండా 3+3 లేన్లు) 75 మీటర్ల రైట్ ఆఫ్ వే తో నిర్మించారు. గచ్చిబౌలి జంక్షన్ వద్ద జీహెచ్ఎంసీ నిర్మించిన కొండాపూర్ మరియు శిల్పా లేఅవుట్ వైపు వెళ్లే రెండు ఫ్లైఓవర్ల అప్రోచ్ ర్యాంపులు ప్రస్తుత రహదారికి ఇరువైపులా ఉండటంతో ట్రాఫిక్ బాటిల్‌నెక్ ఏర్పడుతోంది. దీంతో, నానక్‌రాంగూడ వరకూ ట్రాఫిక్ రద్దీ కొనసాగుతోంది. దీంతో, నానక్‌రాంగూడ నుంచి గచ్చిబౌలి వరకు ఓఆర్ఆర్ ఎడమ వైపు ప్రధాన రహదారిని మూడు వరుసల నుంచి నాలుగు వరుసలకు విస్తరించాలని హెచ్సీజీసీఎల్ ప్రతిపాదించింది. దీంతో, ఈ పనులకు ప్రభుత్వం అనుమతిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0