ట్రాఫిక్‌, కాలుష్యం త‌గ్గాలంటే ప్ర‌భుత్వం ఇలా చేయాల్సిందే!

Metro expansion around ORR is key to reducing traffic and pollution. Telangana’s plan could reshape Hyderabad real estate and city commuting.

Dec 6, 2025 - 21:49
Dec 6, 2025 - 21:50
 0  9
ట్రాఫిక్‌, కాలుష్యం త‌గ్గాలంటే ప్ర‌భుత్వం ఇలా చేయాల్సిందే!
Metro-expansion-around-ORR-hyderabad

* ఓఆర్ఆర్ చుట్టూ మెట్రోను విస్త‌రించాలి
* వాహ‌నాల‌ను మెట్రో వ‌ర‌కే ప‌రిమితం
* ఓఆర్ఆర్ చుట్టూ పార్కింగ్ ఏర్పాటు
* అక్క‌డ్నుంచి మెట్రో ద్వారా న‌గ‌రంలోకి!

గ్రేటర్ హైదరాబాద్ మహానగర విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఔటర్ చుట్టూ మెట్రో రైలు ప్రాజెక్టును పొడిగించే ప్రతిపాదన మరోసారి తెరపైకి వస్తోంది. ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న జీహెచ్ఎంసీ పరిధి త్వరలో 2,700 చదరపు కిలోమీటర్లకు పెరగనుంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాలన్నింటినీ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్ ను ఏర్పాటు చేస్తే మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

గ్రేటర్ సిటీ భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఔటర్ చుట్టూ మెట్రో మార్గాన్ని నిర్మించి, అనుసంధానించడంతో పాటు జాతీయ రహదారుల నుంచి నగరంలోకి వచ్చే వాహనాలను శివార్ల వరకే పరిమితం చేయడం వల్ల నగరవాసులకు మెరుగైన రవాణా వ్యవస్థను అందించొచ్చు. అలాగే ఆయా ప్రాంతాల ప్రజలకు, స్థానికులకు సులువైన, వేగవంతమైన ప్రయాణం అందించడానికి మెట్రో అత్యంత కీలకంగా మారనుందని అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు వాహన కాలుష్యాన్ని సైతం అరిక‌ట్టొచ్చు.

విశ్వనగరంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్‌ నగరంలో మెట్రోను మరింతగా విస్తరించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ మేరకు రెండో దశలో పార్ట్-ఏ కింద 5 కారిడార్లు, పార్ట్-బీ కింద 3 కారి డార్లను చేపట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలను కనెక్ట్ చేసేలా మొత్తం 8 కారిడార్లలో 163 కిలోమీటర్లలో నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు డీటైల్ ప్రాజెక్టు రిపోర్టులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ స‌ర్కార్ కోరింది. మెట్రో విస్తరణలో ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, కోల్‌కతా తర్వాత 5వ స్థానంలో హైదరాబాద్ ఉంది. దీన్ని మొదటి స్థానానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పని చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

మెట్రో రైల్ మూడో దశ విస్తరణలో భాగంగా ఔటర్ రింగ్‌ రోడ్ల నుంచి నగరానికి వచ్చే ప్రజల కోసం.. గత బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనల్ని రూపొందించారు. ఓఆర్ఆర్‌ శంషాబాద్‌ జంక్షన్‌ నుంచి తుక్కుగూడ, బొంగులూరు మీదుగా పెద్ద అంబర్‌పేట జంక్షన్‌ వరకు 40 కిలోమీటర్ల వరకు కారిడార్‌ ఏర్పాటు చేస్తామ‌ని అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఓఆర్ఆర్‌ పెద్ద అంబర్‌పేట జంక్షన్‌ నుంచి ఘట్‌కేసర్‌, శామీర్‌ పేట్‌ మీదుగా మేడ్చల్‌ జంక్షన్‌ వరకు 45 కిలో మీటర్లు, మేడ్చల్‌ ఓఆర్ఆర్ జంక్షన్‌ నుంచి దుండిగల్‌ మీదుగా పటాన్‌చెరు ఓఆర్ఆర్ జంక్షన్‌ వరకు 29 కిలోమీటర్లు, పటాన్‌చెరు జంక్షన్‌ నుంచి కోకాపేట మీదుగా నార్సింగి జంక్షన్‌ వరకు 22 కిలో మీటర్ల కారిడార్లను ఏర్పాటు చేస్తామ‌ని గత‌ ప్రభుత్వం ప్రతిపాదనల్లో స్పష్టంగా ఉంది.

మెట్రో రైల్ రెండో దశలోని పార్ట్‌-బీలో శంషాబాద్ ఎయిర్‌ పోర్టు- భారత్‌ ఫ్యూచర్‌ సిటీ వరకు 40 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించారు. శంషాబాద్‌, పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల మీదుగా భారత్‌ ఫ్యూచర్‌ సిటీ వరకు కారిడార్‌ను నిర్మిస్తున్నారు. దీంతో 14 గ్రామాలకు రవాణా సౌకర్యం లభించనుంది. అలాగే ఓఆర్ఆర్‌ పెద్ద అంబర్‌పేట్‌ జంక్షన్‌ నుంచి మేడ్చల్‌ జంక్షన్‌ వరకు ఉన్న 14 గ్రామాలకు, మేడ్చల్‌ జంక్షన్‌ నుంచి పటాన్‌చెరు వరకు 10 గ్రామాలు, పటాన్‌చెరు జంక్షన్‌ నుంచి నార్సింగి జంక్షన్‌ వరకు 12 గ్రామాలకు ప్రయోజనం చేకూరనుంది. నార్సింగి ఓఆర్ఆర్ జంక్షన్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు వరకు ఔటర్‌ మెట్రోను విస్తరిస్తే మరో ఆరు గ్రామాలకు మెరుగైన రవాణా అందనుంది.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన రాయదుర్గం మార్గానికి కిలోమీటర్ దూరంలో మరో 22 కిలోమీటర్లను జోడించి నార్సింగి జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు ఔటర్ మెట్రోను విస్తరిస్తే.. 158 కిలోమీటర్ల మేర వలయాకారంలో మెట్రో తిరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ వలయాకారం నుంచి నగరంలోకి ఇంటర్ కనెక్టివిటీని కూడా మెరుగుపరిస్తేనే సులువైన మెట్రో ప్రయాణం అందుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఔటర్ నుంచి వాహనాల ద్వారా వచ్చే వారు తమ వాహనాలను నగరంలోకి తీసుకురాకుండా ఉండేందుకు నలుదిక్కులా 5 నుంచి 10 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని గతంలో నిర్ణయించారు. ఔటర్ జంక్షన్ వద్ద మెట్రో రైలు ఎక్కిన ప్రయాణికులు కేవలం 20 నుంచి 25 నిమిషాల్లో నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరుకుని సాఫీగా పనులను చేసుకుని వెళ్లాలని, ఔటర్ చుట్టూ ఎండ్ టు ఎండ్ వరకు మెట్రోను నడిపిస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0